Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!

Anitha

Anitha

Home Minister Anitha: విశాఖ పర్యటనకు వచ్చిన వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై జగన్ వ్యవహరించిన తీరును తప్పుబడుతూ పలు ఆరోపణలు చేశారు. జగన్‌మోహన్ రెడ్డికి “విశాఖ స్టీల్ ప్లాంట్” అనే పదం పలికే అర్హత కూడా లేదని హోంమంత్రి వ్యాఖ్యానించారు. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను రాజధాని అవసరాలకు వినియోగించాలని జగన్ భావించారని, దీనిని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారని ఆమె పేర్కొన్నారు.

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు ఆందోళనలు చేస్తున్న సమయంలో జగన్ ఒక్కరోజు కూడా ధర్నా ప్రాంగణానికి వెళ్లలేదని విమర్శించారు అనిత. కార్మికులను విమానాశ్రయానికి పిలిపించి మాట్లాడారని, ప్రస్తుతం కూడా కార్మిక సంఘాల నాయకులను తన వద్దకు పిలిపించుకుని చర్చలు జరుపుతున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రస్తుతం రూ.60 లక్షల నుంచి రూ.1 కోటి వరకు బీమా ప్రయోజనాలు అందుతున్నాయని అనిత తెలిపారు. అంతేకాకుండా, తొలిసారిగా మరణించిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించే నిర్ణయాన్ని కేంద్ర ఉక్కు మంత్రి హెచ్.డి. కుమారస్వామి తీసుకున్నారని వెల్లడించారు.

×
×
Ad

ఒకప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం 99 శాతం ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేసే స్థితికి చేరుకుందని హోంమంత్రి పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కృషి చేశాయని చెప్పారు. ఇక, ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం సందర్భంగా సంస్థ రూ.150 కోట్ల బీమా చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.12 కోట్లు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకుందని ఆరోపించారు. అలాగే గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన 10.24 శాతం వాటాను కూడా గత ప్రభుత్వం వదులుకుందని విమర్శించారు.

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా కేంద్ర ఉక్కు మంత్రిని విశాఖకు తీసుకురాలేకపోయిందని అనిత ఆరోపించారు. ప్రస్తుతం కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి స్వయంగా స్టీల్ ప్లాంట్‌లో తెల్లవారుజాము వరకు ఉండి పరిస్థితులను సమీక్షించారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడింది తమ ప్రభుత్వమేనని, మరణించిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని హోంమంత్రి స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత..