CPM Letter To Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు లేఖ రాసింది సీపీఐ(ఎం).. కేంద్రం నుంచి వచ్చిన 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.1,121 కోట్లు వెంటనే పంచాయితీలకు విడుదల చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచుల వేతనాలు పెంచాలని, గ్రామ సమస్యలు పరిష్కారం చేయాలని పవన్ కల్యాణ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.. రాజ్యాంగం ప్రసాదించిన మూడు దొంతరల అధికార వ్యవస్థలో దిగువనున్న స్థానిక సంస్థలకు నిధులు, విధులు బదలాయించడంలో ఇప్పటికీ లోపాలు కొనసాగుతున్నాయి. రోజురోజుకీ కేంద్రీకరణ బలపడుతోంది. అభివృద్ధిలో స్థానిక సంస్థలైన పంచాయితీలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. కానీ, కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వ కేంద్రీకృత విధానాల వలన పంచాయితీల్లో అభివృద్ధి పడకేసింది. రాష్ట్రంలో సర్పంచులు పార్టీయేతర ప్రాతిపదికపై ఎన్నికై నాలుగేళ్లు దాటుతోంది. ఎన్నో ఆశలతో గ్రామాల్లో అభివృద్ధి చేద్దామనే ఉత్సాహంతో ఎన్నికైన సర్పంచులు నిధుల్లేక, ప్రభుత్వ ప్రోత్సాహం లేక అభివృద్ధి కార్యక్రమాలు నత్తనడకన నడుస్తున్నాయని పేర్కొన్నారు.
Read Also: Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్
ఇక, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన సర్పంచులు 50 శాతానికి పైగా ఉన్నారు. వారందరూ అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయిస్తే, వాటికి చెందిన బిల్లులు కూడా గత ప్రభుత్వం విడుదల చేయలేదు. పంచాయితీలకు ఇవ్వవలసిన ఆర్ధిక సంఘం నిధులు ఇవ్వలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్ధిక సంఘం నిధులను విద్యుత్ బకాయిల పేరుతో దారిమళ్ళించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మొదట విడత నిధులు విడుదల చేసినా, గత 6 నెలలుగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15 ఆర్థిక సంఘం రెండవ విడత నిధులు రూ.1121 కోట్లు విడుదల చేయకపోవడంతో వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాటి కోసం చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు. అయినా ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ సమస్యల పరిష్కారానికి మీరు శ్రద్ధ చూపాలని కోరుతున్నామని పేర్కొన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు..
Read Also: Uttarakhand Floods: ఉధృతంగా పోటెత్తిన గంగమ్మ.. శివుని చెంతకు చేరిక!
ఈ క్రింది చర్యలు తీసుకొని స్థానిక సంస్థలను, గ్రామ స్వపరిపాలనను ప్రోత్సాహించాలి..
* కేంద్ర ప్రభుత్వం నుండి 6 నెలల క్రితం విడుదలైన 15వ ఆర్ధిక సంఘం నిధులు గ్రామ పంచాయితీల ఖాతాలకు వెంటనే విడుదల చేయాలి.
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర 5వ ఆర్ధిక సంఘమును ఏర్పాటు చేసి రాష్ట్రంలోని గ్రామ పంచాయితీలకు గత నాలుగేళ్లుగా రావలసిన నిధులు బదిలీ చేయాలి.
* కూటమి ప్రభుత్వం ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సర్పంచుల గౌరవవేతనం రూ.3000 నుండి రూ.10,000 వరకు పెంచాలి.
* పంచాయితీ బిల్లులు ఎప్పటికప్పుడు విడుదలయ్యేలాగా పంచాయితీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయాలి.
* 73,74 రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ పంచాయితీలకు సంక్రమించిన 29 అంశాలను రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా బదిలీచేయాలి.
* సర్పంచుల విధినిర్వహణలో మరణిస్తే రూ.20,00,000 ల వరకు ప్రమాద భీమా సదుపాయాన్ని కల్పించాలి.
* 5వ షెడ్యూల్ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాల అభివృద్ధికి, గిరిజన తండాల గ్రామ పంచాయితీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి.
* జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం అమల్లో గ్రామ పంచాయితీల పర్యవేక్షణ ఉండాలి.
* గ్రామ పంచాయితీలకు రావలసిన రిజిస్ట్రేషన్ సర్ ఛార్జీలను క్రమం తప్పకుండా పంచాయితీ ఖాతాలో జమ చేయాలి.
* అర్బన్ డెవలప్‌మెంట్ ఆధారిటీ వారు వేసే లేఔట్‌లకు ఇచ్చే పర్మిషన్‌లకులా ఆ పరిధిలోని గ్రామ పంచాయితీల తీర్మానం కావాలని ఆదేశాలు ఇవ్వాలని.. పలు అంశాలను తన లేఖ ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు సీపీఎం ఏపీ కార్యదర్శి వి. శ్రీనివాసరావు..