గూడూరులో ఎన్డీయే కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి వెలగపల్లి వర ప్రసాదరావు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాశం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర ప్రసాదరావు మాట్లాడుతూ.. వైసీపీకి ఆదరణ లేనప్పుడు కష్టకాలంలో పార్టీలో చేరాన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేరలేదు.. ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశాను.. దళితుడి నాయకత్వాన్ని ఓర్చుకోలేక సీఎం కుట్ర చేశారు అని ఆయన ఆరోపించారు. మీరు రాజకీయ భిక్ష పెడితే తీసుకునే దానికి మేము ఏమన్నా అసమర్థులమా అంటూ ప్రశ్నించారు. ఐఏఎస్ పదవిని విడిచిపెట్టి ప్రజల్లో ఉండడానికి రాజకీయాల్లోకి వచ్చాను అని వెలగపల్లి వర ప్రసాదరావు చెప్పారు.
Read Also: Sadhguru: బ్రెయిన్ సర్జరీ తర్వాత సద్గురు తాజా సందేశమిదే
జగన్ గుండెల్లో ఉండడానికి కాదు.. చిల్లకూరులో సిలికా తవ్వకాలతో స్మశానాలు, ఊర్లు నాశనం అవుతున్నాయని బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు ఆరోపించారు. మద్యపాన నిషేధం అని చెప్పి జగన్ మాట తప్పారు.. రకరకాల బ్రాండ్ల పేరుతో మద్యాన్ని అమ్మి ఆ అవినీతి సొమ్ముతో ఓట్లు కొనేందుకు సిద్ధపడుతున్నారు.. జగన్ చెప్పే సంక్షేమ పథకాలు ఒక బూటకం అని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ సహాయం లేకపోతే బటన్ నొక్కడానికి జగన్ దగ్గర డబ్బులు ఉండేవి కాదన్నారు. రాష్ట్రంలో అమలయ్యే సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం నిధులతో చేస్తున్నారు.. మేము రెండోసారి ఎమ్మెల్యేగా ఉండకూడదా అంటూ ప్రశ్నలు సందించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా విషయంలో ఏనాడైనా మాట్లాడారా.. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఉండదు అని తిరుపతి ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు పేర్కొన్నారు.