గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ అంతర్గత విభేదాలు మరోసారి గరంగరంగా మారుతున్నాయి.. వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా.. పాత శత్రువులు మిత్రులుగా మారుతుండగా.. వారిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు వల్లభనేని వంశీ.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన వల్లభనేని వంశీ.. యార్లగడ్డ పై నిప్పులు చెరిగారు.. గన్నవరం ప్రజలకు తెలుసు నేను విలనో, మంచి వాడినో తెలుసన్న ఆయన.. యార్లగడ్డది ఏమైనా మహేష్ బాబు ముఖమా..? అంటూ ఎద్దేవా చేశారు.. యార్లగడ్డ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మూడేళ్లు సహనంతో ఉన్నాను.. ఇక భరించే ప్రసక్తే లేదన్న ఆయన.. డొక్క చించి డోలు కడతాను అంటూ వార్నింగ్ ఇచ్చారు.
Read Also: COVID 19 syndrome: పిల్లలకు పోస్ట్ కోవిడ్ ముప్పు..! వారు డేంజర్‌లో..?
సహించే వాడిని కాను.. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదంటూ యార్లగడ్డపై విరుచుకుపడ్డారు వల్లభనేని వంశీ మోహన్… వైసీపీలో కర్త, కర్మ, క్రియ అంతా వైఎస్ జగన్మోహన్‌రెడ్డే.. ఆయన ఏది చేయాలనుకుంటే అదే జరుగుతుందన్నారు. ఇక, యార్లగడ్డ వెంకట్రావ్ నా కంటే ఏడాది ముందే పార్టీలోకి వచ్చాడు.. కానీ, పార్టీ జెండా కుట్టిన వాడు కాదని కౌంటర్ ఇచ్చారు. మళ్లీ పోటీ చేయాలనుకుంటే పార్టీ పెద్దలను వెళ్లి అడగాలని సూచించారు. మరోవైపు, పాలసీలో భాగంగానే టీడీపీలో ఉన్నప్పుడు విమర్శలు చేశానన్న వంశీ.. అప్పుడు వైఎస్ జగన్ పై నా మీద వీళ్లు తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు.. గన్నవరం నుండి వచ్చే ఎన్నికల్లో నేనే వైసీపీ అభ్యర్థిని అని స్పష్టం చేసిన వంశీ మోహన్.. యార్లగడ్డవి రంగుల కలలు అంటూ సెటైర్లు వేశారు.
ఇక, మట్టి స్థానిక వనరు.. గన్నవరంలో మట్టి తీసుకుని వెళ్లి కుప్పంలో అమ్మితే డీజిల్ ఖర్చుకే ఆరిపోతారు అని ఎద్దేవా చేశారు వంశీ.. కృష్ణపట్నం నుంచి చైనాకు సరఫరా చేయరు కదా? అని ప్రశ్నించిన ఆయన.. మా నియోజకవర్గంలో పోలవరం కుడి కాలువ గట్టులు 15, 20 అడుగుల ఎత్తున మట్టి ఉంటుంది అన్నారు. మరోవైపు, ఉద్యోగాలు వేయిస్తానని డబ్బులు తీసుకున్న వ్యక్తులు నా మీద మాట్లాడుతున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు వల్లభనేని వంశీ మోహన్.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూల్లో ఇంకా ఆయన ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి.