Vallabhaneni Vamsi: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు తోక పట్టుకుని ఈదాలనుకుంటున్నారని.. పవన్ తన క్యాడర్‌ను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. మంత్రులపై దాడి చేయడం చాలా పొరపాటు అని.. తన క్యాడర్‌కు పవన్ కళ్యాణ్ చాలా తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని ఆరోపించారు. 6 శాతం ఓట్ బ్యాంక్ ఉన్న జనసేన ఇలా దాడి చేస్తే 50 శాతం ఓట్ బ్యాంక్ ఉన్న వైసీపీ దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీడీపీ క్యాడర్ ఇక్కడి వైసీపీ ఎమ్మెల్యేలను తిడుతూ వీడియోలు చేస్తున్నారని.. సిజేరియన్ ఆపరేషన్‌లో 30 మంది, గురుకుల విద్యార్ధులు 30 మంది చనిపోతే టీడీపీ నేతలు కనీసం పరామర్శకు కూడా ఎందుకు వెళ్లలేదని వల్లభనేని వంశీ ప్రశ్నించారు. అక్కడ ఆస్తులు ఉన్నాయి కనుక విమర్శించలేరా అని నిలదీశారు. మోదీ, అమిత్ షాలను రాత్రిపూట కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం అంటారుగా.. వాళ్ళను అడిగి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సోము వీర్రాజు రాజధాని కోసం ఓ లక్షన్నర కోట్లు ఎందుకు తీసుకునిరారని సూటి ప్రశ్న వేశారు.
Read Also: CM Jagan: రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుంది..!!
విశాఖలో అక్రమాలు జరుగుతున్నాయని ఊరకనే ఆరోపణలు చేయటం ఎందుకు అని.. సీబీఐతోనో, ఎఫ్‌బీఐతోనో విచారణ చేయమని కేంద్రాన్ని అడగాలని ప్రతిపక్షాలకు వల్లభనేని వంశీ హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం వైసీపీ అభ్యర్థిని తానేనని.. ఈ విషయంలో టీడీపీ వాళ్ళకు కూడా స్పష్టత ఉందన్నారు. వైసీపీలో ఎవరికైనా అనుమానాలు ఉంటే అధిష్టానం దగ్గరకు వెళ్ళి స్పష్టత తెచ్చుకోవచ్చన్నారు. వెన్నుపోటు ఇంకా చంద్రబాబును వెంటాడుతూనే ఉందని.. ప్రజలు నమ్మటం లేదని అర్ధమైందన్నారు. అందుకే జబర్దస్త్ లాంటి ఆహా షోకు వెళ్లి చంద్రబాబు వివరణ ఇచ్చాడన్నారు. వెన్నుపోటు పొడిచానని చంద్రబాబు, బాలకృష్ణ ఒప్పుకుంటారని ఎలా అనుకుంటామని.. టీడీపీని బతికించుకోవటానికే ఎన్టీఆర్‌ను తప్పించాం అన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి ఎందుకు వేరే పార్టీల్లోకి వెళ్లారో చెప్పాలన్నారు. బాలకృష్ణ చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఎందుకు ఉన్నాడని.. హరికృష్ణ కొత్త పార్టీ ఎందుకు పెట్టుకున్నాడో కూడా వివరణ ఇవ్వాలన్నారు.
Read Also: పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ బ్యూటీ తమన్నా
తాను విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానన్న ప్రచారంలో నిజం లేదని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడాన్ని తాను వ్యతిరేకించలేదని, మరోసారి పేరు మార్పును పరిశీలించాలని కోరినట్లు చెప్పారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ చాలా పెద్ద లీడర్లని.. ఎన్టీఆర్ పేరు మార్చినంత మాత్రాన తక్కువ చేసినట్లు కాదన్నారు. గతంలో టీడీపీ జూ.ఎన్టీఆర్‌ను వాడుకుని వదిలేసిందని వల్లభనేని వంశీ ఆరోపించారు.