ఆన్‌లైన్ ప్రేమికుడి కోసం అమెరికాకు చెందిన జాక్లిన్ ఫోరెరో అనే యువతి ఖండాంతరాలు దాటుకుని భారత్‌లోని ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘హాయ్’ అనే పలకరింపుతో మొదలైన స్నేహం.. చివరికి పెళ్లిపీటల దాకా వెళ్లింది. ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తారని చెప్పడానికి ఇదే చక్కటి ఉదాహరణ. దాదాపు వేల మైళ్ల దూరం ప్రయాణం చేసి ఏపీలోని ఒక మారమూల గ్రామానికి తల్లితో కలిసి ఫోరెరో వచ్చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పంచుకున్నారు.
చందన్.. ఏపీలోని ఒక పల్లెటూరు యువకుడు. ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో చందన్ ఫ్రొఫెల్ చూసి ఫోరెరో ప్రేమలో పడింది. మొట్టమొదటిగా ఆమెనే హాయ్ అని పలకరించింది. అలా మొదలైన సంభాషణ.. ప్రేమలో పడేసింది. త్వరలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 14 నెలల తర్వాత కొత్త అధ్యాయానికి సిద్ధపడుతున్నట్లు పేర్కొన్నారు. చందన్ అభిరుచులకు ఆకర్షితురాలైనట్లు ఫోరెరో తెలిపింది.
8 నెలల ఆన్‌లైన్ డేటింగ్ తర్వాత.. చందన్‌తో పెళ్లికి తన తల్లి అంగీకరించినట్లు ఆమె చెప్పింది. జీవిత భాగస్వామి కోసం తన తల్లితో కలిసి భారత్‌కు వచ్చినట్లు ఫోరెరో స్పష్టం చేసింది. చందన్ వీసా కోసం ప్రయత్నిస్తున్నామని.. అమెరికాలో ఇద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని ఫోరెరో పేర్కొంది. ఇదిలా ఉంటే ఆన్‌లైన్ ప్రేమికులకు నెటిజన్లు గట్టిగానే మద్దతు ఇస్తున్నారు. సుఖసంతోషాలతో ఇద్దరూ హాయ్‌గా జీవించాలని ఆకాంక్షిస్తున్నారు. జంట చూడ ముచ్చటగా ఉందని మరికొందరు వ్యాఖ్యానించారు.