ఏపీలో టీడీపీ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఎప్పుడూ వార్తల్లో వుంటారు. తాజాగా ఆయన భద్రతకు సంబంధించి ట్విస్ట్ లు బయటపడుతున్నాయి. పయ్యావుల కేశవ్ కు భద్రత పై సందిగ్ధత కొనసాగుతోంది. చంద్రబాబు నివాసంలో సమావేశానికి గన్ మెన్ లేకుండానే వచ్చారు పయ్యావుల కేశవ్. గన్ మెన్ అంటూ నిన్న నా వద్దకు వచ్చిన వ్యక్తి ఎటు వెళ్ళాడో తెలీదు. గన్ మెన్ లేకుండానే తిరుగుతున్నా.. ఏం జరుగుతుందో చూద్దాం. రెండు రోజుల్లో సంచలనాలు బయటపెడతానన్నారు కేశవ్.
పయ్యావుల కేశవ్ విషయంలో ప్రభుత్వం తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పయ్యావుల సెక్యూర్టీ ఎపిసోడులో ట్విస్టులు బయటపడుతున్నాయి. సోమవారం పయ్యావుల వద్దకు వచ్చిన కొత్త గన్ మెన్ ఆయనతో కాసేపు మాట్లాడిన సంగతి తెలిసిందే. తనను వ్యక్తిగత భద్రత సిబ్బందిగా నియమించారని పయ్యావులకు పరిచయం చేసుకున్నారు కొత్త గన్ మెన్. అయితే, సంప్రదాయం ప్రకారం యూనిఫాంలో ఉన్న ఆర్ఐ వచ్చి పీఎస్ఓను మారుస్తున్నామన్న విషయాన్ని వెల్లడించాలన్నారు పయ్యావుల. వచ్చిన వ్యక్తి గన్ మెన్ అవునో.. కాదో తనకు తెలియదన్నారు కేశవ్. ఆర్ఐ వచ్చి గన్ మెన్లను మార్చిన విషయాన్ని తెలిపి.. కొత్త పీఎస్వోను పరిచయం చేసిన వెంటనే విధుల్లో చేరమని గన్ మెన్ కు సూచించారు పయ్యావుల. అయితే ఇవాళ ఆ గన్ మెన్ గానీ, ఆర్ ఐ గానీ తన వద్దకు రాలేదని తెలిపారు పయ్యావుల కేశవ్.
అంతకుముందు పయ్యావుల గన్ మెన్లను వెనక్కు రావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించినట్టుగా వార్తలు వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ విషయమై ప్రభుత్వానికి పయ్యావుల కౌంటర్ ఇచ్చాకే సెక్యూర్టీని విత్ డ్రా చేసిందంటోంది టీడీపీ. అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ పయ్యావుల ఆరోపణలు చేస్తున్నారు. పయ్యావులకు సెక్యూర్టీ విత్ డ్రా చేసుకోవడం ద్వారా ప్రభుత్వం బెదిరింపులకు దిగిందంటోంది టీడీపీ.మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ డీజీకి గతంలోనే పయ్యావుల లేఖ రాశారు. తనకు 1+1 స్థానంలో 2+2 భద్రత కల్పించాలని లేఖలో కోరారు కేశవ్. లేఖ రాసిన తర్వాత పూర్తి స్థాయిలో సెక్యూరిటీని ఉప సంహరించడంపై పయ్యావుల అనుచరుల్లో ఆందోళన వ్యక్తం అయింది. అయితే, జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అనంతరం కొత్తగా పయ్యావులకు కేటాయించిన గన్ మెన్ల గురించిన సమాచారం తెలియచేశారు. ఇదిలా ఉంటే సంచలనాలు బయట పెడతానన్న పయ్యావుల కేశవ్ ఏంచేస్తారో చూడాలి.