ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్న స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్..
మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి రద్దు అయినట్లు ప్రకటించింది. గత కొన్ని రోజులుగా నడుస్తున్న సస్పెన్స్‌కు మంధాన ఫుల్ స్టాప్ పెట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి రద్దు అయిన విషయాన్ని ప్రకటించింది. పెళ్లి రద్దు గురించి ప్రకటించిన కొంతసేపటికే.. ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. నవంబర్ 23న ఈ జంటకు వివాహం జరగాల్సి ఉంది. అయితే, స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానాకి గుండెపోటు రావడం, పలాష్ కూడా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేయడంతో పెళ్లిని వాయిదా వేసుకున్నారు. తాజాగా, స్మృతి తన పెళ్లి రద్దును ప్రకటించిన తర్వాత ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం చూస్తే, వీరిద్దరు శాశ్వతంగా విడిపోయినట్లు తెలుస్తోంది. పలాష్ ఆస్పత్రిలో చేరడం, పెళ్లి ఆగిపోయిన తర్వాత అనేక ఊహాగానాలు చుట్టుముట్టాయి. పలాష్ వేరే అమ్మాయితో కలిసి స్మృతిని మోసం చేసినట్లు ఆన్లైన్లో పెద్ద చర్చ నడిచింది.
ఆర్మీ రిక్రూట్మెంట్కు పచ్చజెండా ఊపిన ముస్లిం దేశం..
ఆర్మీ రిక్రూట్మెంట్కు ఓ ముస్లిం దేశం పచ్చజెండా ఊపింది. ఇంతకీ ఆ ముస్లిం దేశం ఏంటో తెలుసా.. సౌదీ అరేబియా. ఈ ముస్లిం దేశం తన సైన్యాన్ని బలోపేతం చేయడనికి ప్లాన్ చేస్తుంది. సౌదీ అరేబియా సైన్యంలో కొత్తగా యువకులు, మహిళలను నియమిస్తోంది. సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ పురుషులు, మహిళలిద్దరికీ కొత్త సైనిక నియామక ప్రక్రియను డిసెంబర్ 7న నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపింది. అర్హత కలిగిన సిబ్బందితో జాతీయ దళాలను బలోపేతం చేయడమే ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ లక్ష్యం అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశ అధికారిక జాయింట్ మిలిటరీ రిక్రూట్మెంట్ కమాండ్ ప్లాట్‌ఫామ్ ద్వారా మాత్రమే ఈ నియామకాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఈ నియామక ప్రక్రియ దాని సమగ్రతకు ప్రత్యేకమైనది, విస్తృత శ్రేణి అర్హతలు, ర్యాంకులను కలిగి ఉంది. అందుబాటులో ఉన్న స్థానాలు, విభిన్న విద్యా నేపథ్యాలకు అనుగుణంగా సైన్యంలో నియామకాలను రూపొందించారు. అన్ని రంగాల నుంచి ప్రతిభావంతులకు సైన్యంలో చోటు సంపాదించుకోవడానికి అవకాశం కల్పించారు. అందుబాటులో ఉన్న సైనిక ర్యాంకులు ప్రారంభ స్థాయి నుంచి నాన్-కమిషన్డ్ ఆఫీసర్ పాత్రల వరకు ఉన్నాయి. సైనికుడు, మొదటి సైనికుడు, కార్పోరల్, వైస్ సార్జెంట్, సార్జెంట్ స్థాయి వరకు పోస్ట్‌లకు సౌదీ రిక్రూట్ చేసుకోనుంది.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో విచిత్ర సంఘటన
వరంగల్ జిల్లా సంగెం మండలం వంజర పల్లి గ్రామంలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.. గ్రామంలో 375 మంది జనాభా వున్న గ్రామంలో ఎస్టీ జనాభా ఏ ఒక్కరూ లేనప్పటికీ సర్పంచ్, మూడు వార్డు స్థానాలకు ఎస్టీ రిజర్వేషన్‌ను ఎన్నికల అధికారులు కేటాయించారు. దీంతో గ్రామంలో సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేయడానికి ఏ ఒక్కరు లేకపోవడంతో సర్పంచ్ తో పాటు మూడు వార్డు సభ్యులకు నామినేషన్ దాఖలు కాలేదు. ఎన్నికలు కేవలం 5 వార్డులకు మాత్రమే జరగనున్నాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో వరంగల్ జిల్లాలోని వంజరపల్లి గ్రామం చర్చనీయంశంగా మారింది. నలుగురు వార్డు సభ్యులకు బీసీ ఒకటి, 4 ఎస్సీ కేటాయించడం జరిగింది. ఈ స్థానాలకు మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. గ్రామంలో లేని జనాభా కు సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులకు ఎస్టీ రిజర్వేషన్ కేటాయించడంపై గ్రామస్తులు ఎన్నికల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2018లో గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ వంజనపల్లి గ్రామపంచాయతీ గత ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి బీసీ రిజర్వేషన్లు కేటాయించారు.
ఘోరం.. 60,000 పెంగ్విన్లు మృతి.. కారణం ఏంటంటే?
దక్షిణాఫ్రికా తీరం వెంబడి ఇటీవలి సంవత్సరాలలో 60,000 కంటే ఎక్కువ ఆఫ్రికన్ పెంగ్విన్లు చనిపోయాయి. పెంగ్విన్ ల మృతికి కారణం ఆకలి. ఆహారం దొరక్క మృత్యువాత పడుతున్నాయి. వాటి ప్రధాన ఆహారం సార్డిన్ చేపలు దాదాపుగా కనుమరుగవుతున్నాయి అనే దిగ్భ్రాంతికరమైన విషయాన్ని కొత్త పరిశోధన వెల్లడించింది. 2004, 2012 మధ్య, దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద పెంగ్విన్ కాలనీలు అయిన డాసన్ ద్వీపం, రాబెన్ ద్వీపంలోని 95% కంటే ఎక్కువ పెంగ్విన్లు చనిపోయాయి. ఈ పెంగ్విన్లు ఆకలితో చనిపోయాయని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. పెంగ్విన్లు ప్రతి సంవత్సరం తమ పాత ఈకలను భర్తీ చేసుకుంటాయి. ఈ ప్రక్రియ 21 రోజులు ఉంటుంది. ఈ సమయంలో, వాటికి ఆహారం దొరకకపోతే, వాటి శరీర నిల్వలు తగ్గిపోయి చనిపోతాయి.
రామాలయం పక్కన చర్చి.. ఆందోళనకు దిగిన హిందూ సంఘాలు
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు ప్రాంతంలో చర్చి కార్యకలాపాలపై హిందూ సంఘాల ఆందోళన చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రామాలయం పక్కనే అనుమతి లేకుండా చర్చి నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ హిందువులు పెద్ద సంఖ్యలో చర్చి ముందు నిరసన వ్యక్తం చేశాయి. అయితే, చర్చి లోపల క్రైస్తవులు ప్రార్థనలు చేస్తుండగా, బయట హిందూ సంఘాల కార్యకర్తలు “జైశ్రీరామ్” నినాదాలు చేస్తూ ధర్నా్కు దిగారు. చర్చిని మూసివేసేంత వరకు అక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
జాతి కోసం.. జనహితం కోసం.. గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలి..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌కు హైదరాబాద్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. సోమ, మంగళవారాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న ఈ రెండు రోజుల సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు హాజరవనున్న నేపథ్యంలో, సమ్మిట్ ప్రాంగణంతో పాటు నగరాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారు. క్రమంలో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తన సందేశాన్ని అందించారు. ‘జాతి కోసం… జనహితం కోసం… గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలి.. కార్యాలు చేయాలంటే…మహా సంకల్పం కావాలి… సరిగ్గా రెండేళ్ల క్రితం నాకు ఆ ధైర్యం ఇచ్చి…తమ ఓటుతో గెలుపు సంకల్పాన్ని ఇచ్చి… నిండు మనస్సుతో ఆశీర్వదించిన తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు.
ఇండిగో ప్రయాణికులకు రూ. 610 కోట్లు రీఫండ్..
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు స్వల్ప ఊరట లభించింది. టికెట్ల సొమ్ము రూ.610 కోట్లను ఇండిగో రీఫండ్ చేసింది. అలాగే, 3000 లగేజీ బ్యాగులను ఇప్పటి వరకు ప్యాసింజర్లకు అందించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది. అయితే, సాధారణంగా రోజుకు 2,300కి పైగా విమానాలు నడిపే ఇండిగో, శనివారం నాడు 1,500కి పైగా ఫ్లైట్లు నడిపినట్లు పేర్కొనింది. ఇక, ఈ సంఖ్యను ఈరోజు సుమారు 1,650కు పెంచుతూ, తమ 138 గమ్యస్థానాల్లో 135 ట్రిపులను పునరుద్ధరించినట్లు తెలిపింది.
రంగంలోకి గ్రేహౌండ్స్, ఆక్టోపస్.. డ్రోన్ కెమెరాలతో నిఘా
హైదరాబాద్‌లో జరగనున్న రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్‌కు పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. సమ్మిట్‌ను సురక్షితంగా నిర్వహించేందుకు దాదాపు 6 వేల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 14 నుంచి సమ్మిట్ ప్రధాన వేదిక వరకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నామని వెల్లడించారు. సమ్మిట్ వేదికను ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు. సమ్మిట్‌కు వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి భద్రతా లోటు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్దం
తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించటం, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్దమైంది. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత అద్భుతంగా ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 44కు పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవాప్తంగా పేరెన్నికగల కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నారు. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివస్తున్నారు. నేటి మధ్నాహ్నం ఒకటిన్నరకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ లాంఛనంగా సమ్మిట్ ను ప్రారంభిస్తారు. సుమారు రెండు వేల మంది దేశ, విదేశీ అతిధులు ప్రారంభవేడుకకు హాజరవుతున్నారు. సమ్మిట్ లో వివిధ అంశాలపై నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్-షా, తదితరులు ప్రసంగించనున్నారు.
గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు రతన్ టాటా పేరు
హైదరాబాద్‌లో మౌలిక వసతులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రావిర్యాల వద్ద ఉన్న నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును ప్రతిపాదిత రేడియల్ రింగ్ రోడ్డుతో (RRR) కలుపుతూ నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు పద్మభూషణ్ రతన్ టాటా పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశ పారిశ్రామిక రంగానికి ఆయన అందించిన విశేష సేవలకు గౌరవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా, ప్లానెట్ ఎర్త్ ఫర్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ కింద మరో ముఖ్యమైన రహదారికి అమెరికా 45వ , 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని ప్రతిపాదించారు. హైదరాబాద్‌లోని యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్ జనరల్ వెంటుగా ఉన్న హైప్రొఫైల్ రహదారిని ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా పిలవాలని యోచిస్తున్నారు. ఈ ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు యునైటెడ్ స్టేట్స్ ఎంబసీకి లేఖలు రాసి అధికారికంగా తెలియజేయనుంది. అంతర్జాతీయ సంబంధాలు, పరస్పర సహకారం దృష్టిలో పెట్టుకుని ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన వార్షిక US–India Strategic Partnership Forum (USISPF) కాన్క్లేవ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ సందర్భంగా హైదరాబాద్‌లోని ముఖ్యమైన రహదారులకు ప్రపంచ స్థాయి ప్రముఖులు, సంస్థల పేర్లు పెట్టాలని ఆయన ప్రతిపాదించారు.