తుఫాన్ సమయంలో ప్రజలకు అండగా నిలిచాం..
గుంటూరు జిల్లా తెనాలిలో మొంథా తుఫాన్ బాధితులకు మంత్రి నాదెండ్ల మనోహర్ నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం పంపిణీ చేశారు. చంద్రబాబు కాలనీలో పునరావాస కేంద్రాల్లో ఉన్న 615 మందికి మూడు రోజులకు సరిపోయే నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల, కలెక్టర్ తమీమ్ అన్సారియా, సబ్ కలెక్టర్ సంజనా సింహతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయిలో అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూశారు.. విపత్తులు మన చేతిలో ఉండవు.. తుఫాన్ సమయంలో ప్రజలకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం వ్యవహరించింది.. ప్రాణ, పశు, అస్థి నష్టం ఉండొద్దనే కృత నిశ్చయంతో కూటమి ప్రభుత్వం కష్టపడి పని చేసింది.. ఇప్పుడు వచ్చిన తుఫాన్ ను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో పునరావాస కేంద్రాలకు ప్రజలు వచ్చే విధంగా అధికారులకు సహకరించాలి అని మంత్రి నాదెండ్ల కోరారు.
వరదలో కొట్టుకుపోయిన యువతీ యువకులు
తెలుగు రాష్ట్రాల్లో ‘మొంథా’ తుఫాన్ బీభత్సం సృష్టిచింది.. తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసాయి. దీంతో వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వరదలతో రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలం అయ్యింది.. కొన్ని గంటల పాటు కనివిని ఎరుగని స్థాయిలో భారీ వర్షం కురిసింది. దాదాపు 42.2 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. దీంతో చెరువులు కుంటలు తెగి.. వరద నీరు అంతా ఇళ్లలోకి చేరింది. చిన్న చితక వాగుల నుంచి నదుల వరకు పొంగి పోర్లుతున్నాయి. దీంతో జనగామ జిల్లాలో ఎక్కడ చూసిన వరదలే దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో మత్తడిని దాటేందుకు ప్రయత్నించిన యువతీ యువకులు బైక్‌తో పాటు వరదలో కొట్టుకుపోయారు.
ఆ పాలనను 5 పదాల్లో చెప్పొచ్చు.. విపక్ష కూటమిపై మోడీ విసుర్లు
బీహార్‌లో ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది. సమయం దగ్గర పడడంతో నాయకులు విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఇక అధికార-విపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్న రాహుల్ గాంధీ.. మోడీ లక్ష్యంగా విమర్శలు చేయగా.. ఈరోజు ప్రధాని మోడీ.. విపక్ష కూటమి టార్గెట్‌గా ధ్వజమెత్తారు. గురవారం ముజఫర్‌పూర్‌లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ-కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. ఆర్జేడీ-కాంగ్రెస్ పాలనను ఐదు పదాల్లో చెప్పొచ్చన్నారు. ‘‘కట్ట, క్రోర్తా, కటుటా, కుషాసన్, అవినీతి’’ అని పిలిచారు. కట్టా (నాటు తుపాకీ), క్రోర్తా (క్రూరత్వం), కటుటా (దురుద్దేశం), కుషాసన్ (సుపరిపాలన లేకపోవడం), కరప్షన్ (అవినీతి).. ఇవే ఆ రెండు పార్టీల విధానాలు అని వివరించారు. ఆర్జేడీ అధికారంలో ఉన్న సమయంలో షోరూంలో నుంచి వాహనాలను దోచుకెళ్లారని.. అలాగే 35 వేల నుంచి 40 వేల వరకు కిడ్నాప్ కేసులు నమోదయ్యాయని వివరించారు.
సీఎం రేవంత్ కోడ్ ఉల్లంఘించారు.. బీజేపీ ఫిర్యాదు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మర్రి శశిధర్ రెడ్డితో పలువురు బీజేపీ ప్రతినిధులు ఎన్నికల అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కోడ్ ఉల్లంఘించారని ఆరోపించారు. ఇలా మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఒక వర్గం ఓట్లు ప్రభావితం అవుతాయన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ‘మంత్రివర్గ విస్తరణపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం, చర్యలు తీసుకోవాలని కోరాం. ఒక వర్గానికి మంత్రి పదవి ఇచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు పాయల్ శంకర్.
నీట మునిగిన 4 వేల ఇండ్లు.. హన్మకొండ కన్నీళ్లు
మొంథా తుఫాన్ ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేసేసింది. మరీ ముఖ్యంగా హన్మకొండ జిల్లాను నిండా ముంచింది. నగరంలో ఎటు చూసినా వరద నీళ్లే ఉన్నాయి. దాదాపు అన్ని కాలనీలు నీటిలోనే ఉన్నాయి. సమ్మయ్య నగర్ మొత్తం నీట మునిగింది. దాదాపు 4వేల ఇండ్ల దాకా నీట మునిగినట్టు అధికారులు చెబుతున్నారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రజలంతా ఇండ్ల మీదకు ఎక్కి సాయం కోసం చూస్తున్నారు. చాలా మంది ఇండ్లను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లిపోయారు. ఇంట్లోని సామాన్లు మొత్తం మునిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూములు సకాలంలో తెరవక పోవడం వల్ల వరద ముంచెత్తిందని ఆరోపిస్తున్నారు.
తుఫాన్ బాధితులకు సీఎం భారీ సాయం.. మంత్రి అనగాని కీలక వ్యాఖ్యలు
రేపల్లెలోని మున్సిపల్ కార్యాలయంలో తుఫాన్ వరద ప్రభావంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొంథా తుఫాన్ ప్రభావాన్ని వీలైనంత వరకు తగ్గించడానికి కూటమి ప్రభుత్వం చేసిన కృషి ఒక చరిత్ర.. గత ఆరు రోజులుగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ మైక్రో లెవల్లో పర్యవేక్షించారు.. అనివార్య కారణాల వల్ల రెండు ప్రాణాలు పోయాయి తప్ప ప్రాణ, ఆస్థి నష్టాన్ని పెద్ద ఎత్తున తప్పించాం.. తుఫాన్ కారణంగా ప్రభావితులైన వారికి సీఎం చంద్రబాబు భారీగా సహాయం ప్రకటించారని మంత్రి అనగాని పేర్కొన్నారు.
ఇవన్నీ మానవ తప్పిదాలు.. చంద్రబాబు సృష్టించిన విపత్తు ఇది
ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈ తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. “తుఫాన్ కారణంగా పంటలు బాగా నష్టపోయాయి. ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి. పైరు పొట్ట దశలో ఉన్నప్పుడు తుఫాన్ తాకి దిగుబడులు తగ్గిపోయాయి. నేలకొరిగిన పంట తిరిగి నిలబడే అవకాశం లేదు. దాదాపు 25 జిల్లాల్లో ప్రభావం చూపగా, 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి,” అని తెలిపారు. 11 లక్షల ఎకరాల్లో వరి, 1.14 లక్షల ఎకరాల్లో పత్తి, 1.15 లక్షల ఎకరాల్లో వేరు శనగ, 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.9 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు నష్టపోయాయని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో ఆర్బీకే వ్యవస్థ అప్రమత్తంగా ఉండేదని, ప్రతి పంటకూ ఈ-క్రాప్ చేసేవాళ్లమన్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు సమన్వయంతో రైతులకు సహాయంగా నిలిచేవని, ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు భరోసా ఇచ్చామన్నారు జగన్.
వాట్సప్ కాల్స్ రికార్డ్ చేస్తున్నారంటూ ప్రచారం.. సీపీ సజ్జనార్ సీరియస్..
వాట్సప్ కాల్స్ రికార్డ్ చేస్తున్నారంటూ ప్రచారం సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. రేపటి నుంచి అన్ని ఆడియో వీడియో వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. జనాలకు సంబంధించిన అన్ని సోషల్ మీడియా అకౌంట్లు పర్యవేక్షిస్తామని, కాల్స్ రికార్డు చేస్తామని ఓ పోస్ట్‌లో తప్పుడు వార్తను షేర్ చేశారు. ఈ అంశంపై తాజాగా సీపీ సజ్జనార్ స్పందించారు. తన ఫొటోతో ముద్రించిన ఈ నకిలీ పోస్ట్‌పై సీరియస్ అయ్యారు. వాట్సప్ కాల్స్ రికార్డ్ చేస్తున్నానంటూ చేస్తున్న ప్రచారాన్ని తప్పుబట్టారు.. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మొంథా తుఫాను ఎఫెక్ట్.. తెలంగాణలో దెబ్బతిన్న 230 కి.మీ రోడ్లు..!
మొంథా తుఫాను ఎఫెక్ట్ తో ఆర్ అండ్‌బీ రోడ్లు 334 లోకేషన్స్‌లో 230 కి.మీ దెబ్బతిన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రోడ్లు భవనాలు శాఖ పూర్తి అప్రమత్తంగా ఉందని వెల్లడించారు. తాజాగా తుఫాన్ ఎఫెక్ట్స్‌పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి మాట్లాడారు. నిన్న అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు.. దెబ్బతిన్న, కోతకు గురైన రోడ్లు, బ్రిడ్జిలు, కాజ్‌వేల తాత్కాలిక పునరుద్ధరణకు సుమారు రూ. 7కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ. 225 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు రూపొందించినట్లు స్పష్టం చేశారు. తుఫాన్ వల్ల అకాల వర్షాలతో ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వరి, పత్తి పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయని తెలిపారు.
5.04 కి.మి మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు షురూ.. ఆ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్..!
ప్యారడైజ్ నుంచి డైరీ ఫార్మ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. బాలంరాయి నుంచి డెయిరీఫామ్ వరకు 5.04 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ వద్ద 600 మీటర్ల మేర సొరంగమార్గం నిర్మించనున్నారు. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ రన్ వేకు ఎలాంటి ఆటంకం లేకుండా భారీ టన్నెల్ నిర్మాణం చేపడతారు. బోయిన్‌పల్లి జంక్షన్ వద్ద రెండు వైపులా 248 మీటర్ల నుంచి 475 మీటర్ల పొడవు, 8 మీటర్ల పొడవుతో ఎంట్రీ, ఎగ్జిట్‌లు ఏర్పాటు చేస్తారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భాగంగా బలంరాయి వద్ద నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ప్యారడైజ్ నుంచి బేగంపేట్ ఎయిర్ పోర్టు వెనుక వైపు వరకు ట్రాఫిక్ మళ్ళింపు కొనసాగుతోంది. కొంపల్లి నుంచి నగరానికి వస్తున్న వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ముందస్తు ప్రకటనలు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.