అసాంఘిక కార్యకలాపాలకు ప్రొద్దుటూరు అడ్డాగా మారింది..
కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరు పట్టణం క్యాసినో, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది.. టీడీపీ ముఖ్య నాయకులే ఈ వ్యవహారాలను నడిపిస్తున్నారు.. వీరు మట్కా, జూదం, క్రికెట్ బెట్టింగ్‌తో పాటు గోవాలో క్యాసినోలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో గంజాయి విచ్చల విడిగా అమ్ముతున్నారు.. యువతను పెడత్రోవ పట్టిస్తున్నారని తెలిపారు. ఈ జూద కార్యకలాపాల నిర్వాహకులు.. ఈ నెల 23, 24, 25 తేదీలలో కడప నుంచి హైదరాబాద్ మీదుగా గోవాకు ఇండిగో విమానంలో టికెట్లు కూడా బుక్ చేసుకున్నారని మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు.
భీమవరం డీఎస్పీ తీరుపై ఎస్పీతో చర్చించిన డిప్యూటీ సీఎం పవన్
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో భీమవరం డీఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయినట్లు, సివిల్ వివాదాలలో సదరు అధికారి జోక్యం చేసుకుంటున్నారని, కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నారనే తరహా ఫిర్యాదులు డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి వచ్చాయి. ఇక, ఈ విషయంపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఈ అంశంపై ఫోన్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులు ప్రస్తావించి డీఎస్పీ వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని ఆదేశాలు జారీ చేశారు.
కెప్టెన్‌గా రిషభ్ పంత్.. వైస్ కెప్టెన్‌గా సాయి సుదర్శన్!
గాయం కారణంగా భారత జట్టు నుంచి తప్పుకున్న స్టార్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో త్వరలో జరిగే రెడ్ బాల్ సిరీస్‌లో భారత్-ఎ జట్టు తరఫున పంత్ బరిలోకి దిగనున్నాడు. అంతేకాదు ఈ సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా సాయి సుదర్శన్ ఎంపికయ్యాడు. గత జూలైలో అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లోని మాంచెస్టర్ టెస్ట్ (నాలుగో టెస్టు)లో పంత్ పాదానికి గాయమైన విషయం తెలిసిందే. అక్టోబర్ 30న బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో భారత్-ఎ, దక్షిణాఫ్రికా-ఎ మధ్య మొదటి నాలుగు రోజుల మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 25న హిమాచల్ ప్రదేశ్‌తో జరిగే ఢిల్లీ రంజీ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్‌లో పంత్ తిరిగి బరిలోకి దిగుతాడని అందరూ భావించారు. కానీ రంజీ ట్రోఫీ చివరి రోజు తర్వాత రెండు రోజుల్లోనే భారత్-ఎ, దక్షిణాఫ్రికా-ఎ మధ్య తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అతడు రంజీ ట్రోఫీలో ఆడే అవకాశాలు లేవు.
ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం.. మాజీ అధ్యక్షుడికి జైలు శిక్ష!
ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఫ్రెంచ్ చరిత్రలో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించనున్న తొలి నాయకుడిగా దేశ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ రికార్డు సృష్టించనున్నారు. పారిస్‌లోని లా శాంటే జైలులో మంగళవారం నుంచి ఆయన శిక్ష ప్రారంభం కానుందని విశ్లేషకులు చెబుతున్నారు. 2007 అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం లిబియా నుంచి చట్టవిరుద్ధంగా నిధులు పొందడం ద్వారా ఆయనపై నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సర్కోజీపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆయన తాను నిర్దోషినని చెబుతున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ గడువు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ గడువు ముగిసింది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. దీంతో ఆర్వో కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చిన అభ్యర్థులను అధికారులు లోనికి అనుమతించారు. ఆర్వో కార్యాలయం కాంపౌండ్ లో భారీగా క్యూ కట్టారు స్వతంత్ర అభ్యర్థులు. సుమారు వందకు పైగా స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచారం. గేట్ లోపల ఉన్న అభ్యర్థుల నామినేషన్లు ఆర్వో అధికారి స్వీకరించనున్నారు. గడిచిన 9 రోజుల్లో రెండు రోజులు సెలవు మినహా 7 రోజుల్లో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. చివరి రోజు కావడంతో ఈ రోజు కూడా భారీ సంఖ్యలో వచ్చారు స్వతంత్ర అభ్యర్థులు.. రేపు అధికారులు నామినేషన్ల పరిశీలనను చేపట్టనున్నారు. ఈనెల 24వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఇక పోలింగ్ నవంబర్ 11న నిర్వహిస్తారు. అలాగే ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరిగి, ఎన్నికల ప్రక్రియను నవంబర్ 16 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది.
బీహార్ రాజకీయాల్లో బాంబు పేల్చిన పప్పు యాదవ్..
బీహార్ రాజకీయాలు హీట్ ఎక్కాయి. తాజాగా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ నితీష్ కుమార్ గురించి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. పలువురు విలేకరులు పప్పు యాదవ్‌తో మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారా అని అడిగారు. దానికి ఆయన స్పందిస్తూ.. కచ్చితంగా కాదని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత బీజేపీ నితీష్‌ను గౌరవించదని ఆయన బదులిచ్చారు. ఒకవేళ కాంగ్రెస్ ఆయనను గౌరవిస్తుందా అని అడిగినప్పుడు, పప్పు యాదవ్ స్పందించి “కచ్చితంగా అవును” అని అన్నారు. “ఆయన రావాలనుకుంటే, కాంగ్రెస్ ఆయనను గౌరవిస్తుంది, అలాగే స్వాగతిస్తుంది” అని చెప్పారు.
నార్సింగిలో కారు బీభత్సం.. బాలుడిపై నుంచి దూసుకెళ్లిన కారు
రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలంలోని పుప్పాలగూడ అల్కాపూరీ కాలనీలో సోమవారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. టపాసులు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వస్తున్న తండ్రి–కొడుకుపై వేగంగా దూసుకొచ్చిన కారు బీభత్సం సృష్టించింది. వివరాల ప్రకారం.. పుప్పాలగూడ ప్రాంతానికి చెందిన వ్యక్తి తన కుమారుడు కుశల జోయల్‌తో కలిసి బైక్‌పై ఇంటికి వస్తుండగా, ఎదురుగా వచ్చిన కారు బైక్‌ను ఢీ కొట్టింది. ఢీకొట్టిన వేగంతో బాలుడు రోడ్డుపై పడిపోగా, అదే కారు అతనిపై నుంచి దూసుకెళ్లింది. తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. తక్షణమే స్థానికులు స్పందించి, గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. కారు నడిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.
ఖబర్దార్, ఇక చూసుకుందాం.. మోసిన్ నఖ్వీకి బీసీసీఐ వార్నింగ్!
ఇటీవలే దాయాది పాకిస్థాన్‌ను ఓడించిన భారత జట్టు ఆసియా కప్ 2025ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ విజయం తర్వాత భారత జట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్, పీసీబీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని స్వీకరించడానికి టీమిండియా నిరాకరించింది. దాంతో ఫైనల్ రోజు నఖ్వీ ట్రోఫీతో దుబాయ్‌లోని ఒక హోటల్‌కు వెళ్ళాడు. పాకిస్తాన్‌కు బయలుదేరే ముందు ట్రోఫీని ఏసీసీ కార్యాలయంలో ఉంచాడు. నఖ్వీ ట్రోఫీని భారత జట్టుకు ఇవ్వడానికి నిరాకరించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏసీసీ కార్యాలయానికి వచ్చి ట్రోఫీని తీసుకోవాలని షరతు పెట్టాడు.
బీహార్ పోరులో కొత్త ట్విస్ట్! ఎన్నికల్లో ఎంట్రీ ఇచ్చిన తాంత్రిక పూజారులు..
ఎన్నికల రణరంగంలో విజయ పతాకాన్ని ఎగరవేయడానికి అభ్యర్థులు అనేక ఎత్తుగడలు వేస్తుంటారు. కానీ ఈ రాష్ట్రంలో ఏకంగా పలువురు తాంత్రిక పూజారులను ఆశ్రయించినట్లు వార్తలు బయటికి రావడం కలకలం రేగుతుంది. ఈ ఘటన ఎక్కడ వెలుగు చూసిందని అనుకుంటున్నారు.. మహాకాళ నగరం, అన్ని కాలాలకు అధిపతి అయిన ఉజ్జయినిలో ఈ ఘటన బయటపడింది. ఈ ప్రాంతం శతాబ్దాలుగా తాంత్రిక అభ్యాసాలు, ఆధ్యాత్మిక సాధనలకు అత్యంత అనువైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. అందుకే దీపావళి (కార్తీక అమావాస్య) రాత్రి ఉజ్జయినిలోని విక్రాంత్ భైరవ శ్మశానవాటిక స్థలంలో తాంత్రికులు, అభ్యాసకుల ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు సమాచారం.
ఏయ్ బిడ్డా….జూబ్లిహిల్స్ కిషన్ రెడ్డి అడ్డా
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలను విమర్శించారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. “ఏయ్ బిడ్డా… జూబ్లిహిల్స్ కిషన్ రెడ్డి అడ్డా” అంటూ ప్రారంభించిన ఆయన.. కిషన్ రెడ్డి నాయకత్వంలో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు దొందూ దొందే అని ఆయన విమర్శించారు. ఈ రెండు పార్టీలు కలిసి ప్రజలను దోచుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.. ఈ రెండు పార్టీల పాలనలో జూబ్లిహిల్స్ ప్రజలకు ఒరిగిందేమిటి? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదని, అయితే హరీష్ రావు చెప్పగానే ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయన్నారు.