ఫోటోలు వైరల్.. ఫిబ్రవరిలోనే సమంత-రాజ్ ఎంగేజ్మెంట్ .. !
సమంత – రాజ్ ల వివాహం ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు రెండేళ్లుగా ప్రేమాయణం కొనసాగించిన ఈ జంట, ఈ నెల 1న అధికారికంగా ఒక్కటైంది. అయితే, అంతకుముందే వీరి నిశ్చితార్థం రహస్యంగా జరిగిందనే ఊహాగానాలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఈ చర్చకు ప్రధాన కారణం.. పెళ్లి వేడుకలో సమంత ధరించిన ఉంగరం. ఇటీవల పోస్ట్ చేసిన వివాహ ఫోటోలో కనిపించిన అదే ఉంగరం, ఆమె వాలెంటైన్స్ డే కు ఒక రోజు ముందు (ఫిబ్రవరి 13) షేర్ చేసిన పోస్ట్‌లలో కూడా దర్శనమిచ్చింది. దీంతో, సమంత-రాజ్ జంట వాలెంటైన్స్ డే సందర్భంగా లేదా అంతకుముందే అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకుని ఉండొచ్చని అభిమానులు, మీడియా వర్గాలు భావిస్తున్నారు.
గాజాలో పెళ్లి సందడి.. పెద్ద ఎత్తున సామూహిక వివాహాలు
గాజాలో రెండేళ్ల పాటు బాంబ్ దాడులతో దద్దరిల్లింది. భీకర దాడులతో గాజా కకావికలం అయింది. ఇటీవల గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం జరగడంతో ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. దీంతో ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన జంటలన్నీ ఒకేసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టాయి. మంగళవారం పెద్ద ఎత్తున సామూహిక వివాహాలు జరిగాయి. దీంతో గాజాలో సందడి వాతావరణం నెలకొంది. గాజాలో మంగళవారం 54 జంటలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాయి. గాజాలోని ఖాన్ యూనిస్‌లోని హమద్ నగర్‌లో జరిగిన వేడుకలో 54 పాలస్తీనా జంటలు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుక సందడి.. సందడిగా సాగింది.
నేడు హుస్నాబాద్‌కు సీఎం రేవంత్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ముఖ్యమంత్రి పర్యటనకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ముస్తాబయింది. నేడు సాయంత్రం మూడు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్ కు రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ కోసం హుస్నాబాద్ పట్టణంలోని ఏనే వద్ద మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సభా ప్రాంగణంలోనే హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సుమారు 262.68 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు పలువురు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
కేరళ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సోనియా గాంధీ..
కేరళలోని మున్నార్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. మున్నార్‌లో సోనియా గాంధీ అనే మహిళ బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తోంది. 34 ఏళ్ల సోనియా గాంధీ మున్నార్ పంచాయతీలోని 16వ వార్డు నల్లతన్ని నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆసక్తికరంగా ఆమె తండ్రి బలమైన కాంగ్రెస్ మద్దతుదారుడు.. మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలైన సోనియా గాంధీ ప్రేరణతో తన కుమార్తెకు ఆ పేరు పెట్టారు. ఈ విషయం బీజేపీ అభ్యర్థి సోనియా గాంధీ స్వయంగా తెలియజేశారు. తన తండ్రి కట్టర్ కాంగ్రెస్ వాది అని అందుకే ఆయన తనకు ఆ పేరు పెట్టారని సోనియా చెప్పారు. తన కుటుంబం మొత్తం నేటికీ కాంగ్రెస్ మద్దతుదారులుగానే ఉందని తెలిపారు.
ఫాల్కన్ స్కాం.. అమర్‌దీప్ విమానం ఈడీ వేలం
ఫాల్కన్ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో ముఖ్యమైన అడుగు వేసింది. అమర్‌దీప్ కుమార్‌కు చెందిన హాకర్ 800A ప్రైవేట్ విమానాన్ని స్వాధీనం చేసుకున్న ఈడీ, ఇప్పుడు దానిని అధికారికంగా వేలం వేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫాల్కన్ స్కాం బహిర్గతమైన వెంటనే అమర్‌దీప్ మరియు అతని గ్యాంగ్ ఇదే విమానంలో దుబాయ్‌కి పారిపోయిన విషయం తెలిసిందే. తర్వాత భారత్‌కు తిరిగి వచ్చిన ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఈడీ స్వాధీనం చేసుకుని, ప్రస్తుతం బేగంపేట విమానాశ్రయంలో నిలిపి ఉంచింది. విమానం చెడిపోకుండా, ఉపయోగించడానికి వీలుగా ఉండేందుకు వేలం వేసేందుకు కోర్టు అనుమతి కూడా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈడీ ప్రకటన ప్రకారం, ఎంఎస్టీసీ లిమిటెడ్ ద్వారా ఈ విమానం అమ్మకానికి ఉంచబడుతోంది. డిసెంబర్ 7న విమానం పరిశీలనకు అందుబాటులో ఉండగా, డిసెంబర్ 9న ఆన్‌లైన్ వేలం జరగనుంది. ఈ విమానం విక్రయం ద్వారా వచ్చే మొత్తాన్ని ఫాల్కన్ స్కాం వల్ల నష్టపోయిన బాధితులకు పరిహారంగా చెల్లించనున్నట్లు ఈడీ స్పష్టం చేసింది.
మోడీపై కాంగ్రెస్ మరో వివాదాస్పద వీడియో.. రెడ్ కార్పెట్‌పై టీ అమ్ముతున్నట్లుగా పోస్ట్
రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం భారత్ పర్యటనకు వస్తున్నారు. రెండు రోజుల పాటు పుతిన్ భారత్‌లో పర్యటించనున్నారు. ఇందుకోసం భారత్ ఏర్పాట్లు చేస్తోంది. పుతిన్-మోడీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ఒక వివాదాస్పద వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది.పుతిన్ కోసం భారత్ రెడ్ కార్పెట్ ఏర్పాటు చేసింది. అయితే రెడ్ కార్పెట్‌పై ప్రధాని మోడీ టీ అమ్ముతున్నట్లుగా ఏఐ వీడియోను కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియోపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రధాని మోడీని కాంగ్రెస్ మరోసారి అగౌరవపరిచిందని బీజేపీ ధ్వజమెత్తింది.
దేశవ్యాప్త నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలకు అడ్డాగా ఏపీలోని ఆ మండలం..
ఇతర రాష్ట్రాల వ్యక్తులకు నకిలీ ధ్రువీకరణ పత్రాల మంజూరుకు సత్యసాయి జిల్లా ఓ మారుమూల సచివాలయాన్ని అక్రమార్కులు అడ్డాగా చేసుకున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా అగళి మండలం కొమరేపల్లి సచివాలయంలో జిల్లా గణాంకాల అధికారులు తనిఖీ నిర్వహించారు. ఇక్కడ ఏడాదిగా 3,982 జనన ధ్రువీకరణ పత్రాల జారీ అయినట్లు కనుగొన్నారు. చిన్న పంచాయతీ నుంచి ఇతర రాష్ట్రాలవారికీ మంజూరు చేసినట్లు బట్టబయలైంది. శ్రీ సత్య సాయి జిల్లా అగలి మండలం అగళి ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శితో ప్రాంతంలో ఉన్న సచివాలయ వివరాలు సేకరిస్తున్నారు. అగళి మండలం కోమరేపల్లి సచివాలయం నుంచి వేలకొద్దీ తప్పుడు ధ్రువపత్రాలు మంజూరైనట్లు సమాచారం.
చాంద్రాయణగుట్టలో కలకలం.. ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు
చాంద్రాయణగుట్ట ప్రాంతంలో చోటుచేసుకున్న అనుమానాస్పద మరణాలు స్థానికంగా తీవ్ర భయాందోళనలకు దారితీశాయి. ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం కావడంతో, ఇది హత్య, ఆత్మహత్యనా లేక డ్రగ్స్ ఓవర్‌డోసా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన యువకులను పోలీసులు జహంగీర్, ఇర్ఫాన్‌లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మరణాలు సహజంగా సంభవించి ఉండకపోవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో ఆటో లోపల కీలక ఆధారాలు లభించాయి. మత్తు ఇంజెక్షన్లు, స్టెరాయిడ్స్‌కు సంబంధించిన శాంపిల్స్ అక్కడ దొరికాయి.
ప్రయాణికులకు అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాల ధాటికి రోడ్లు జలదిగ్భందం..
దిత్వా తుఫాను ప్రభావం నెల్లూరు, బాపట్ల జిల్లాలను తీవ్రమైన వర్ష విపత్తులోకి నెట్టేసింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వానతో రెండు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మంగళవారం రాత్రి మరోసారి భారీ వర్షాలు కరిశాయి. దీంతో నగరాలు, శివార్లు, గ్రామాలు అన్నీ నీటితో నిండిపోయి ప్రజలకు రాత్రంతా నిద్రలేని పరిస్థితి ఏర్పడింది. నెల్లూరులో రాత్రి కురిసిన భారీ వాన నగరంలోని ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా మాగుంట లేఅవుట్‌లోని రైల్వే అండర్ బ్రిడ్జ్ పూర్తిగా నీటమునిగిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఐదు అడుగుల వరకు నీరు నిలిచిపోవడంతో ప్రయాణాలు అర్ధరాత్రి నుంచే నిలిచిపోయాయి. మరోవైపు అనేక లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు ఇబ్బందుల్లో మునిగిపోయారు. నగరంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే ప్రతి వర్షానికి సమస్యలు పెరగడానికి కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గందరగోళం
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో ఫ్లైట్‌లకు సాంకేతిక లోపాలు ఏర్పడటంతో భారీ గందరగోళం చోటుచేసుకుంది. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలకు బయలుదేరాల్సిన విమానాలు వరుసగా ఆలస్యమవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చాలా మందిప్రయాణికులు నిన్నటి నుంచి ఎయిర్‌పోర్ట్‌లోనే వేచి చూస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లైట్‌ల ఆలస్యం గురించి సరైన వివరణ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడటంతో ఇండిగో సిబ్బంది ప్రయాణికుల ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో కష్టాలు ఎదుర్కొంటున్నారు. తెల్లవారుజామున 2 గంటలకు బెంగళూరు వెళ్లాల్సిన ఒక ఇండిగో ఫ్లైట్‌ను రన్‌వేపై రెండు గంటల పాటు నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. చివరికి వారిని తిరిగి విమానం నుంచి కిందకు దింపి టెర్మినల్‌లో ఉంచగా, ప్రయాణికుల అసహనం మరింత పెరిగింది.