తిరుపతిలో ప్రసిద్ధి చెందిన శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఈనెలలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు విశేష ఉత్సవ వివరాలను ఆలయ అధికారులు వెల్లడించారు. మే 5న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్లువారి శాత్తుమొర కార్యక్రమం ఉంటుందన్నారు. మే 5న ఉదయం 7 గంటలకు శ్రీభాష్యకార్లు స్వామి, సాయంత్రం 5:30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి, శ్రీ భాష్యకార్లు స్వామి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారని తెలిపారు.
అటు మే 6న ఆలయంలో గంధపుపొడి ఉత్సవం సందర్భంగా ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు శ్రీభాష్యకార్లువారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో దర్శనమిస్తారని పేర్కొన్నారు. మే 6, 13, 20, 27వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తామని వెల్లడించారు.మే 12న ఉత్తరా నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీగోవిందరాజస్వామి మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.
మే 14న శ్రీ మధురకవి ఆళ్వార్ సాత్‌మొరై సందర్భంగా సాయంత్రం 5:30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ మదురకవి ఆళ్వార్, శ్రీ ఆనంతాళ్వార్ ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారన్నారు. మే 16న పౌర్ణమి సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గరుడవాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు అభయమిస్తారని పేర్కొన్నారు. మే 21వ తేదీ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీభూ సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారని.. మే 31వ తేదీ రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు రుక్మిణి సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.