Tirumala: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబైంది. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే శ్రీవారికి నిర్వహించే ఉత్సవాలుగా పేరుగాంచిన బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. కోటి సూర్య ప్రభాతముల సమమైన వాడు, భూ దిగంతాల మధ్య వ్యాపించి వాడు.. మొక్కినంతనే వరాలిచ్చేవాడు, కోరినంతనే కోరికలు తీర్చేవాడు.. తిరుమలగిరి వాసుడు. ఎవరినైతే క్షణకాలం దర్శించుకున్నా.. జన్మ ధన్యమైనట్లు భావిస్తామో.. ఎవరి దర్శనంతో సకల పాపాలు హరించుకుపోతాయని నమ్ముతామో.. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. దివ్య మంగళ స్వరూపుడై.. రకరకాల రూపాల్లో తనకిష్టమైన వాహనాలపై ఊరేగుతూ అభయాన్ని ప్రసాదిస్తుంటే ఆ భాగ్యాన్ని వర్ణించతరమా?. కేవలం బ్రహ్మోత్సవాలకు మాత్రమే ఆవిష్కృతమయ్యే అద్భుతం ఇది. రేపటి నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.. ఇవాళ రాత్రి 7 గంటలకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు..
ఇక, రేపు మధ్యాహ్నం పరివార దేవతలు, గరుడ పఠం ఊరేగింపు.. రేపు సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణంతో ప్రారంభంకానున్నాయి బ్రహ్మోత్సవాలు.. రేపు రాత్రి 8 గంటలకు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు.. రేపు రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి.. అయితే, ఏడుకొండలు నిత్యం పచ్చతోరణంగా భాసిల్లే క్షేత్రం.. తిరుమల క్షేత్రంలో ప్రతి నిత్యం నిత్యోత్సవాలు… ప్రతివారం వారోత్సవాలు… ప్రతి మాసం మాసోత్సవాలు.. నిర్వహిస్తూనే వుంటారు. స్వామివారికి సుప్రభాతం, తోమాలసేవ, అర్చన, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఏకాంత సేవ వంటి నిత్యోత్సవాలు….. విశేష పూజ , అష్టదళపాదపద్మారాధన, సహస్రకలషాభిషేకం, తిరుప్పావడ, పూలంగి సేవ, శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలు… పుష్పయాగం, పవిత్రోత్సవం, ఆణివార ఆస్థానం, వసంతోత్సవం, జేష్ఠాభిషేకం, పార్వేటి ఉత్సవం, ప్రణయ కలహమహోత్సవం, పద్మావతి పరిణయోత్సవం వంటి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది టిటిడి. ఏడాది పొడవునా శ్రీవారికి ఎన్నో ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహించినా.. ఏడాదికోసారి జరిగే బ్రహ్మోత్సవాలకు ప్రత్యేకత వేరు.
..
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబైంది. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే శ్రీవారికి నిర్వహించే ఉత్సవాలుగా పేరుగాంచిన బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సకల ఏర్పాట్లు చేసింది. రేపటి నుంచి అక్టోబరు 2 వరకు 9 రోజులు పాటు సాగే సాలకట్ల బ్రహ్మోత్సవాలు సందర్భంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా టీటీడీ ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్భంగా తొమ్మిది రోజులపాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు ,ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది టీటీడీ.. దసరా నవరాత్రులు జరిగే కన్యామాసంలో శ్రీవేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణా నక్షత్ర శుభ ముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందుగా నవరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రారంభించడం అనాదిగా వస్తోంది. సూర్యచంద్ర మాసాల్లో ఏర్పడే వ్యత్యాసం వల్ల ప్రతి మూడేళ్లకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఇందులో భాగంగా కన్యామాసంలో వార్షిక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రులలో నవరాత్రి బ్రహ్మోత్సవం నిర్వహించటం కూడా ఆనవాయితీ. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం, వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేస్తారు. ధ్వజారోహణం, బలి ఆచారాలు, మహారథోత్సవం, శ్రవణానక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లోనే నిర్వహిస్తారు.
వెంకటేశ్వరుడు ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, భక్తజన వల్లభుడు, నైవేద్య ప్రియుడు. కోరినవారి కొంగుబంగారమై కోరికలను తీర్చే శ్రీవేంకటేశ్వరుని వైభోగం న భూతో న భవిష్యతి. వేంకటాచల క్షేత్రం పై వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుని పిలిచి, లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించాడట. ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణా నక్షత్రం నాటికి ముగిసేలా తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడట. తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయని చెబుతారు. అలా సృష్టికర్త అయిన బ్రహ్మే తిరుమల గిరి రాయుడికి తొలిసారి ఉత్సవాలు జరిపిననట్లు భవిష్యోత్తర పురాణం చెబుతోంది. ఇదే కాదు.. నవాహ్నిక దీక్షతో, నవబ్రహ్మలు, నవ దినాలు… జరిపించే ఉత్సవాలు కావున వీటిని బ్రహ్మోత్సవాలు అంటారన్నది మరో ప్రతీతి. మరికొందరి వ్యాఖ్యల ప్రకారం ఈ బ్రహ్మోత్సవాలకు మరో నిర్వచనమూ ఉంది. అసలు ఈ ఉత్సవాలకు బ్రహ్మదేవుడికి సంబంధం లేదని.. తిరుమలతో శ్రీనివాసుడికి జరిపించే అన్ని ఉత్సవాల కన్నా ఇవి చాల పెద్ద ఎత్తున రంగ రంగ వైభోగంగా జరిగే ఉత్సవాలు కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అంటారని ఆధునికుల భావన. పరబ్రహ్మస్వరూపుడైన శ్రీవారికి చేసే మహా ఉత్సవాలు కాబట్టి వీటిని ‘బ్రహ్మోత్సవాలు’ అని పిలుస్తారని మరి కొందరి అభిప్రాయం.
ఎవరి భావం ఎలా ఉన్నా… నిత్య శోభితుడైన శ్రీనివాసుని… తొమ్మిది వాహనాలమీద కనులారా వీక్షించడమంటే భక్తులకు కోటి వరాలు పొందినంత ఆనందం. అందుకే స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఎక్కడెక్కడినుంచో భక్త కోటి తరలి వస్తుంది. ఈ ఉత్సవాలు జరిగిన తొమ్మిది రోజులూ… తిరుమల భక్త పరమాణువులతో నిండి పోతుంది. ‘నానాదిక్కులెల్ల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి’ అంటూ పదకవితా పితాహముడు అన్నమయ్య వర్ణించినట్లు… ఆద్యంతం సప్తవర్ణ శోభితంగా సాగే .. ఈ ఉత్సవాలను కనులారా వీక్షించేందుకు తండోప తండాలుగా భక్తులు వచ్చి… స్వామి వారి వైభోగాన్ని తిలకించి.. పులకిస్తారు.
ఇక, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు రేపు సాయంత్రం 6 గంటలకు తిరుమల చేరుకుంటారు సీఎం చంద్రబాబు.. రేపు రాత్రి 8 గంటలకు బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకోని పట్టువస్త్రాలు సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో 2026 సంవత్సర క్యాలెండర్, డైరీలను విడుదల చేయనున్నారు.. రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహన సేవలో పాల్గొననున్నారు సీఎం దంపతులు.. ఎల్లుండి ఉదయం 9 గంటలకు యాత్రికుల వసతి సముదాయం 5ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు.. ఉదయం 10:45 గంటలకు తిరుమల పర్యటన ముగించుకుని రేణిగుంట విమానాశ్రయానికి బయల్దేరి వెళ్లనున్నారు సీఎం..