ఏపీ పీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధంగా సభ్యత్వ నమోదు చేయడం ద్వారా ఏడాదిలో పార్టీ సంస్థాగతంగా బలపడతుందని ఆయన అన్నారు. ప్రతి కార్యకర్త గురుతర బాధ్యతతో ఇంటి వద్దనే సభ్యత్వ నమోదు జరిగేలా జిల్లా పార్టీ అధ్యక్షులు చొరవ చూపాలన్నారు.
కమిటీల ఏర్పాటుతో పాటు మండల స్థాయి నుంచి నమోదుకు పార్టీలో గుర్తింపు ఇవ్వాలన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్ముకొనేవాడు నీతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు.. పవన్ కల్యాణ్ అడగాల్సింది.. హెచ్చరిక ఇవ్వాల్సింది ఢిల్లీలో కదా..? పవన్.. ఇక్కడ హెచ్చరిక ఇవ్వడం ఏంటి..? చేతనైతే ఢిల్లీలో ప్రశ్నించు అని అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందని, పెట్రోల్, డీజిల్ ధరలపై గళమెత్తింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు.
టీడీపీ ధర్నాలు చేయాల్సింది పెట్రోల్ బంకుల్లో కాదు ఢిల్లీలో అని ఆయన అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేంతవరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తూనే ఉంటుందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి తెచ్చిన 108 అంబులెన్స్ ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టిందని, ప్రస్తుత పరిస్థితుల్లో నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పుకోవడం ఎంతో పెద్ద గుండె కావాలన్నారు.
చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎక్కడ ఉందని విమర్శలు చేసినా మనో ధైర్యంతో ముందుకు అడుగు వేస్తున్నారని ప్రశంసించారు. బద్వేలు ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా ఎంతో గుండె నిబ్బరంగా ప్రజల్లోకి వెళ్లగలిగామని, కాంగ్రెస్ కార్యకర్తలు అందరం ఒకే మాట మీద సమిష్టిగా నడుద్దామని ఆయన పిలుపునిచ్చారు.