Tammineni Sitaram: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సవాల్ విసిరారు. ఉత్తరాంధ్రకు 14 ఏళ్లు పాలించిన టీడీపీ ఏం చేసిందో.. గత మూడేళ్లలో తాము ఏం చేశామో చర్చకు సిద్ధమని.. టీడీపీ సిద్ధంగా ఉందా అని తమ్మినేని ప్రశ్నించారు. గుడ్డిగా విమర్శిస్తున్న వారికి అభివృద్ధి ఏం కనిపిస్తుందని సెటైర్లు వేశారు. ఎన్నికల్లో ప్రజలు తీర్పునిస్తారని.. ఎవరు ఎలాంటివారో అప్పుడు అచ్చెన్నాయుడికి దద్దమ్మలెవరో తెలుస్తుందని కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ చర్చకు అచ్చెన్నాయుడి లాంటి పానకంలో పుడకలు వద్దన్నారు. డైరెక్టుగా చంద్రబాబుకే సవాల్ విసురుతున్నట్లు తమ్మినేని తెలిపారు.
పేర్లు మార్చిన ఘనత టీడీపీదే అని.. తన దగ్గర చాంతాండంత లిస్ట్ ఉందన్నారు. ఆరోగ్యశ్రీ పేరును ఎన్టీఆర్‌గా మార్చలేదా.. అప్పుడే ఎందుకు మాట్లాడలేదని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ఆముదాలవలస నియోజకవర్గానికి సీఎం జగన్ ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు కేటాయించారని తమ్మినేని సీతారాం ప్రశంసలు కురిపించారు. రెండు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు , వెటర్నరీ పాలిటెక్నిక్, అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కాలేజీలు కేటాయించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీని వ్యవసాయ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు రేపు ప్రారంభం చేయనున్నట్లు స్పీకర్ వెల్లడించారు.
Read Also:Tollywood: ఈ వారం డబ్బింగ్ సినిమాలదే సందడి!
అంతకుముందు ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు వైసీపీ నీతిమాలిన చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో రోజు రోజుకీ దిగజారి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, సీబీఐ, ఈడీ కేసులు, కోర్టుల చివాట్లు, అధికార పార్టీ నేతల అవినీతిపై ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక నీతి మాలిన చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి చర్యలు సమాజానికి చేటు అన్నారు. వైసీపీ నీతిమాలిన చర్యలకు తెలుగు దేశం కార్యకర్తలు, నేతలు ఎవరూ ప్రభావితం కావొద్దని పిలుపునిచ్చారు. వైసీపీ దిగజారుడు రాజకీయాలను, పతనమైన ఆలోచనలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. తమ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా…ప్రజాస్వామ్య పద్ధతిలోనే టీడీపీ ప్రజా సమస్యలపై పోరాడుతుందని అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ నేతలు తమ వైఖరి మార్చుకోకపోతే రాజకీయాల్లో ఉండే అర్హతను సైతం కోల్పోతారని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.