ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశంసలు కురిపించారు. గురువారం పార్లమెంట్ సెంట్రల్ హాలుకు వచ్చిన సీఎం స్టాలిన్‌ను పలువురు వైసీపీ ఎంపీలు కలిశారు. స్టాలిన్‌ను కలిసిన వారిలో వైసీపీ ఎంపీలు మార్గాని భరత్, గోరంట్ల మాధవ్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, మోపిదేవి వెంకటరమణ, విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రెడ్డప్ప, లావు శ్రీకృష్ణదేవరాయలు, వంగా గీత, తలారి రంగయ్య ఉన్నారు. వీరిని డీఎంకే ఎంపీ కనిమొళి సీఎం స్టాలిన్‌కు పరిచయం చేశారు.
ఈ సందర్భంగా వైసీపీ ఎంపీలతో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. ఏపీలో పథకాల గురించి చర్చించారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని మెచ్చుకున్నారు. లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేస్తున్న సీఎం జగన్ అభినందనీయులు అంటూ ప్రశంసించారు. ఏపీలో అమలు చేస్తున్న పథకాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని తమిళనాడులో కూడా ప్రవేశపెడితే బాగుంటుందని సీఎం స్టాలిన్ భావిస్తున్నారు. మరోవైపు అనంతపురం ఎంపీ తలారి రంగయ్య అంతకుముందు సీఎం స్టాలిన్‌ను వ్యక్తిగతంగా కలిసి బీసీ కులగణనపై చర్చించారు.