వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యోదంతం రాష్ట్రంలో రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. పథకం ప్రకారమే నిందితులు ఆయన్ను హతమార్చినట్టు పోలీసుల విచారణలో తేలినా.. రాజకీయంగా ఇది ఊహించని మలుపులు తిరుగుతోంది. ఓవైపు ఎమ్మెల్యే తలారి వెంకట్రావే తెరవెనుక ఉండి ఈ హత్య చేయించాడని గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ అనుమానంతోనే బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు, గంజి ప్రసాద్ కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులు కూడా ఎమ్మెల్యేపై దాడికి దిగారు.
అయితే, తనపై దాడి చేసింది మాత్రం టీడీపీ నాయకులేనని ఎమ్మెల్యే తాజాగా ఆరోపిస్తున్నారు. అంతేకాదు, అందుకు తగిన ఆధారాల్ని కూడా మీడియాకు అందించారు. తనపై దాడి జరిగిన సమయంలో టీడీపీ నాయకులు ఎటాక్ చేసిన ఫోటోల్ని బయటపెట్టారు. ఈ దాడిలో పోలీసులకు కూడా గాయాలయ్యాయన్నారు. తనని హతమార్చి, రాజకీయ హత్యగా చిత్రీకరించాలని చూశారని వెంకట్రావు ఆరోపించారు. తమ నాయకుడు గంజి ప్రసాద్ కుటుంబానికి వైసీపీ ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జగన్ పాలన చూసి ఓర్వలేకే, టీడీపీ నేతలు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని వెంకట్రావ్ మండిపడ్డారు.