శ్రీకాళహస్తీ ఆలయ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాహు కేతు పూజలలో భక్తులకు త్వరలో బంగారు నాగపడగలు వినియోగానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు వెండి నాగపడగలతో తమ దోషాలను తొలగించుకున్న భక్తులు..ఇకపై బంగారు పడగలతో సేవలను పొందనున్నారు. వాయులింగ క్షేత్రం గా…. రాహు కేతువులకు నిలయంగా విరాజిల్లుతున్న ముక్కంటి క్షేత్రం శ్రీకాళహస్తి. రాహు కేతువుల, నాగ దోషాలు, కుజదోషాల నివారణకు పేరుగాంచింది శ్రీకాళహస్తి దేవస్థానం.
శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడు రాహు కేతువుల నిలయంగా పేరుగాంచారు. ఇక్కడి శివుని లింగంపై ఉన్న బంగారు కవచం లో 27 నక్షత్రాలు,9నవగ్రహాలు స్థానమై ఉండటం చేత శ్రీకాళహస్తి క్షేత్రానికి ఏ దోషాలు వర్తింపవు. అందువల్ల గ్రహణ సమయాల్లో కూడా ఈ క్షేత్రాన్ని తెరిచే ఉంచుతారు. గ్రహణ కాల సమయంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహిస్తారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన శ్రీకాళహస్తిలో రాహు కేతు పూజలకు అధిక ప్రాధాన్యత ఉంది. ఎవరైతే పెళ్లి కానివారు, ఉద్యోగం లేనివారు,కాల సర్ప దోషాలు, సకల దోషాలు, ఉన్న వారు ఈ రాహు కేతు పూజలను చేసుకొంటే సకల దోషాలు తొలగి అన్నివిధాలా మంచి జరుగుతుంది అని భక్తుల నమ్మకం.
శ్రీకాళహస్తి దేవస్థానంలో 1985లో ప్రారంభించిన ఈ రాహు కేతు పూజలు మొదట 100 రూపాయల టికెట్టు ధర నిర్ణయించారు. అందులోనూ అప్పట్లో రోజుకు10 పూజలు కూడా పెద్దగా జరిగేవి కావు. క్రమేపీ వీటి ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది.1990 నుండి 200,250 రెండు రకాలుగా రాహు కేతు పూజల టిక్కెట్టు ధరలు నిర్ణయించారు. అప్పటి టీడీపీ హయాంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేతుల మీదుగా ఈ రాహు కేతు పూజలు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి.
భక్తులరద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఆలయ అధికారులు ఈ పూజ టికెట్టు ను 300,500,750 రూ. లుగా భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. 2005 సంవత్సరం తరువాత ఈ రాహు కేతు పూజలకు భక్తులు క్యూ కట్టారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇతర రాష్ట్రాల నుండే కాకుండా దేశ విదేశాల నుండి కూడా భక్తులు ఈ రాహు కేతు పూజలకు రావడం విశేషం. 2016,2017 ప్రాంతంలో ఈవో గా దర్బముళ్ల భ్రమరాంబ బాధ్యతలు చేపట్టాక రాహు కేతు పూజల రేట్ల లో అనూహ్య మార్పులు తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం రాహు కేతులు పూజలు అనూహ్యంగా పెరగడంతో ఆలయ ఆదాయం నెలకు కోట్ల రూపాయల కు చేరింది. సంవత్సరానికి 200 కోట్ల రూపాయలకు చేరింది. అంతేగాక సామాన్యుని నుండి ధనవంతుని దాకా రాహు కేతు పూజలకు క్యూ కడుతున్నారు. దీంతో ఆలయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వేదపండితుల మదిలో మెదిలిన కొత ఆలోచన… భక్తులకు బంగారు నాగపడగలతో రాహు కేతు పూజలు నిర్వహించాలని నిర్ణయించారు.
అయితే ఇది వరకు భక్తులకు 500,750,1500 రూపాయలకు 5గ్రాముల వెండి నాగపడగలు,2500,5000రూ.. రాహు కేతు పూజలకు 10గ్రాముల వెండి నాగపడగలు దేవస్థానం భక్తులకు అందించేది. అదే తరహాలో భక్తులకు ఆలయ చరిత్రలో తొలిసారిగా బంగారు నాగపడగలతో రాహు కేతు పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. అందుకు గాను 5 గ్రాముల బంగారంతో నాగపడగలు తయారు చేయించి భక్తులకు రాహు కేతు పూజల్లో అందించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 5 గ్రాముల బంగారు నాగపడగల తయారీకి సుమారు 30 వేల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు ఆలయ అధికారులు.. ఈ స్వర్ణ నాగపడగలు రాహు కేతు పూజలకు టికెట్టు ధర సుమారు 30 వేల రూపాయల వరకు ఉంటుందన్నారు స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ఇప్పటికే ఆలయ అర్చకులు అధికారులతో చర్చలు జరపామని భక్తుల ఎప్పటినుంచో కోరుతున్నట్లు ఈ బంగారు నాగపడగలతో రాహు కేతు పూజల ఆలోచన వచ్చిందన్నారు బియ్యపు మధుసుదన్ రెడ్డి. ఈ పూజల ద్వారా ఆలయ ఆదాయం మరింత పెరుగుతుందని వచ్చే ఆదాయం ద్వారా భక్తులకు మరింత సేవ చేసే అవకాశం కలుగుతుందంటున్నారు ఎమ్మెల్యే, ఆలయ అధికారులు.
Devineni Uma: పోలవరం పనులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?