అమరావతిలో దొంగలు పడ్డారా? డబ్బులు.. నగలు.. ఇతర ఖరీదైన వస్తువులు కాకుండా రోడ్డులు ఎత్తుకుపోతున్నారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ప్రస్తుతం అమరావతిలో ఇదే హాట్ టాపిక్. ఈ దోపిడీ కేంద్రంగా రాజకీయ రగడ కూడా మొదలైంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
రాజధాని కోసం నిర్మించిన రోడ్లను ఎత్తుకుపోతున్నారు!
అమరావతి రెండేళ్లుగా నిఘా నీడలో ఉంది. అయినప్పటికీ పోలీసుల కన్నుగప్పి ఈ ప్రాంతంలో దోపిడీ దొంగలు చెలరేగిపోతున్నారు. వాళ్లు ఎత్తుకు పోతుంది ఇళ్లలోని బంగారమో.. నగదో కాదు. రాజధాని కోసం నిర్మించిన సీడ్ యాక్సెస్ రహదారులను ఎత్తుకుపోతున్నారు. తవ్వేసి గ్రావెల్‌ను ట్రాక్టర్లు, టిప్పర్లలో తీసుకెళ్లిపోతున్నారట. ఈ పని చేస్తోంది దొంగలో.. దొంగల మాటున ఉన్న పెద్దలో తెలియదు కానీ.. సమస్య మాత్రం రాజకీయ రంగు పులుముకుంటోంది.
రోడ్లు ఎత్తుకెళ్లడంపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం!
రోడ్లు తవ్వేసి ఎత్తుకుపోతున్న కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది వైసీపీ నేతల పనే అని టీడీపీ.. కాదు తెలుగుదేశం వారి పనేనని అధికారపార్టీ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. స్థానికులే రోడ్లను తవ్వేసి.. మట్టిని ఎత్తుకుపోయి ఆ నేరాన్ని తమపై వేస్తున్నారని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. రాజకీయ రగడ కొనసాగుతున్న సమయంలో ఉద్దండరాయునిపాలేనికి స్థానికులు వెళ్లి చూడగా.. రోడ్లు తవ్వుతున్నవారు జేసీబీని లారీ ఎక్కించి మరీ పారిపోయారట. సమస్య ఈ విధంగా రచ్చ రచ్చగా మారడంతో వైసీపీ నేతలు సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. స్థానికంగానే దొంగలు ఉన్నారని.. వారి ఆచూకీ పోలీసులకు చిక్కిందని.. త్వరలోనే అరెస్ట్ చేస్తారని చెబుతున్నారట.
మట్టిని తొలగించి.. కాంక్రీట్ చిప్స్ ఎత్తుకెళ్లిపోతున్నారు!
ఆ మధ్య అమరావతిలో నిర్మాణాల కోసం తీసుకొచ్చిన సామాగ్రిని ఎత్తుకెళ్లిపోయారు. అప్పట్లోనూ తీవ్ర గగ్గోలు లేచింది. ఇప్పుడు రహదారుల వంతు వచ్చింది. మట్టిని తొలగించి.. కింద ఉన్న కాంక్రీట్ చిప్స్‌ను తవ్వి తీసుకెళ్లిపోతున్నారు. అయితే రాజకీయ నేతల హస్తం లేకుండా ఈ విధంగా రోడ్లను తవ్వే సాహసం ఎవరూ చేయబోరన్నది స్థానికంగా వినిపించేమాట. ఆ కోణంలో చాలా వదంతలు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ, టీడీపీ మధ్య విమర్శలు వాడీవేడీగా సాగుతున్నాయి.
రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు సైలెంట్?
సమస్య ముదురుపాకన పడకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు .. రాజకీయ ఒత్తిళ్లు వస్తాయనే ఏమో సైలెంట్ అయ్యారట. గుడని గుడిలో లింగాన్ని మింగేసే ఘనులు ఉన్నఈ రోజుల్లో రోడ్డెత్తుకుపోతున్న చోరులు ఎవరో ఏంటో ఎలా తేలుతుందో మరి. అప్పటి వరకు ఈ అంశంపై రాజకీయ రగడ రచ్చ రచ్చ కొత్త పుంతలు తొక్కుతూనే ఉంటుంది.