Sajjala Ramakrishna Reddy: తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వైసీపీ రాష్ట్ర సమన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డి వీడియో కాన్ఫెరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు అని మండిపడ్డారు. మొత్తం రూ.3900 కోట్ల మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉంటే ఈ బడ్జెట్‌లో కేవలం రూ.2600 కోట్లు కేటాయించడం దుర్మార్గం.. విద్యార్ధుల సంఖ్యను కూడా కుదించేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. పేద, మధ్యతరగతి విద్యార్ధులను చదువులకు దూరం చేసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది.. ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీల నుంచి విద్యార్దులను వెళ్ళగొడుతున్నారు.. దిక్కుతోచని స్థితిలో చదువులు మధ్యలో ఆగిపోతున్నా సర్కారు చోద్యం చూస్తోంది అని సజ్జల అన్నారు.
Read Also: Rohit Sharma: వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో రోహిత్ శర్మ..?
ఇక, కూటమి ప్రభుత్వంపై యువతలోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నిరుద్యోగ యువతకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు విస్మరించారు.. ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా ప్రతి నెలా మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తానంటూ ఇచ్చిన హామీ ఏమయ్యింది?.. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.7200 కోట్లు అవసరం.. కానీ, గత బడ్జెట్ లో దీనికి కేటాయింపులు లేవు అని వెల్లడించారు. ఈ ఏడాది బడ్జెట్ లోనూ పైసా కూడా కేటాయించలేదు అని తేల్చి చెప్పారు. అలాగే, ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం.. అందులో ఐదు కాలేజీల నిర్మాణం పూర్తై.. తరగతులు కూడా ప్రారంభమయ్యాయి.. మిగిలిన వాటిల్లో నిర్మాణ పనులు పూర్తి చేసి తరగతులను ప్రారంభించాల్సి ఉంది.. కానీ, వాటిని కూడా ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తుందన్నారు. ఈ తరుణంలో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్‌సీపీ యువతకు, విద్యార్ధులకు అండగా నిలిచి ప్రభుత్వం విధానాలపై పోరాడాలి.. అందుకోసం తలపెట్టిన యువత పోరులో కలిసి వచ్చే అన్ని విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలతో వైసీపీ నేతృత్వంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట విద్యార్థులు, నిరుద్యోగులు, యవతతో కలిసి వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రదర్శన, ధర్నా కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు.
Read Also: IND vs NZ Finals: ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ టీమిండియాదే- ఫ్యాన్స్..
అలాగే, ఈ నెల 12వ తేదీ వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలి అని సజ్జల పిలుపునిచ్చారు. ప్రతి పల్లెలోనూ పార్టీ జెండాలను ఎగుర వేయాలి.. ప్రజల్లో వైఎస్‌ఆర్‌సీపీకి ఉన్న బలాన్ని చాటుకోవాలని పేర్కొన్నారు. పార్టీ పట్ల సానుభూతితో ఉన్న శ్రేణులను ఆవిర్భావ వేడుకల్లో భాగస్వాములను చేయాలి.. ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను నిలబెట్టుకుంటూ.. రానున్న రోజుల్లో వారికి అండగా ఉంటామనే భరోసాను కల్పించాలి.. మండల స్థాయి కమిటీల ఏర్పాటుకు కూడా నియోజకవర్గ ఇన్‌చార్జీలు వెంటనే చర్యలు తీసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.