ఏపీ రాజధాని అమరావతిపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అమరావతి పేరుతో గత ప్రభుత్వం టీడీపీ అరచేతిలో స్వర్గం చూపించిందని ఆయన ఆరోపించారు. అమరావతిలో టీడీపీ నేతలు ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేసుకున్నారని విమర్శలు చేశారు. రైతు ఉద్యమం పేరుతో చంద్రబాబు గ్యాంగ్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాజధాని పేరుతో లక్ష కోట్ల భారాన్ని ఏ రాష్టం కూడా మోయలేదన్నారు. అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చుపెట్టడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే తమ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు.
గత ప్రభుత్వం తరహాలో తమది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు అని.. రాష్ట్రం మొత్తం తమకు సమానమే అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే న్యాయవ్యవస్థను తాము గౌరవిస్తామన్నారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఎక్కువగా ఉన్నారని, నిజమైన రైతులు తక్కువగా ఉన్నారన్నారు. అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మించి టీడీపీ ప్రభుత్వం రోడ్లు కూడా వేయలేదన్నారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు తామే న్యాయం చేస్తున్నామని సజ్జల తెలిపారు. ప్రజలు ఎన్నిసార్లు ఓటుతో బుద్ధి చెప్పినా టీడీపీ మారడం లేదని మండిపడ్డారు. హైకోర్టు తీర్పు తర్వాత టీడీపీ వర్గమే టపాకాయలు కాల్చి హంగామా చేసిందని ఎద్దేవా చేశారు.