చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లు గ్రామాల్లో తిరుగుతూ విషం చిమ్ముతున్నారంటూ ఏపీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ రాష్ట్రానికి పట్టిన చీడపురుగులు అని ఆరోపించిన ఆమె.. ఒక్క చోట కూడా గెలవలేని పవన్, జగనన్నను ఓడిస్తాననడం సిగ్గు చేటన్నారు. పవన్ ఏమైనా దేవుడా లేక జ్యోతిష్యుడా? అంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిపోయారని, కరోనా కారణంగా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం జగన్ తప్పించుకొని పారిపోలేదన్నారు. 14 సంవత్సరాలు సీఎం చేసినా, ఒక్కరోజైనా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన చేశారా? అంటూ చంద్రబాబుని ఉద్దేశించి ప్రశ్నించారు.
ప్రజలకు ఏమీ చేయలేదు కాబట్టే.. క్విట్ చంద్రబాబు, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో మొన్నటి ఎన్నికల్లో ఆయన్ను తరిమికొట్టారని రోజా అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్న తరుణంలో.. వానపాములు కూడా లేచి బుసలు కొడుతున్నాయని రోజా ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో అన్ని హామీల్ని సీఎం జగన్ నెరవేర్చారని, ఇలాంటి సీఎంను ఒక్క ఏపీలో మాత్రమే చూడగలమని చెప్పారు. 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి, దేశంలో ఎవరూ చేయలేనంత గొప్ప పని జగన్ చేశారన్నారు. సీఎం జగన్‌ను సంక్షేమ సామ్రాట్ అనడంలో ఏమాత్రం సందేహం లేదని మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు.