Andhra Pradesh: ఆర్ధిక ఇబ్బందుల దృష్ట్యా ఏపీ ఇప్పటికే అప్పులు ఎక్కువగా చేస్తున్న రాష్ట్రంగా నిలిచింది. అయితే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఏపీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. ప్రత్యేక డ్రాఫ్టింగ్ సదుపాయం, చేబదుళ్ల పరిమితి దాటిపోవడంతో పాటు ఓవర్ డ్రాఫ్ట్‌లోనే డిసెంబర్ నెల గడిచిపోతుందని.. ఇప్పటికైనా మేలుకోకపోతే ఓడీ పీరిమితిని కూడా రాష్ట్రం దాటిపోతుందని ఆర్‌బీఐ హెచ్చరించింది. ఈనెల 8 వరకు ఏపీ ఓవర్ డ్రాఫ్ట్‌లోనే ఉంది. ఆర్ధిక పరిస్థితుల కారణంగా ఇంకా పలువురు ఉద్యోగులకు జీతాలు అందలేదు. ఈ నేపథ్యంలో ఓవర్ డ్రాఫ్ట్ పరిస్థితులపై హెచ్చరిస్తూ ఆర్‌బీఐ జనరల్ మేనేజర్ ఏపీ ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌కు ఈనెల 9న లేఖ రాశారు.
Read Also: Twitter: సరికొత్తగా ట్విట్టర్.. మూడు రంగుల వెరిఫికేషన్ టిక్ అమలు
నిర్ధిష్ట రుణ పరిమితులను దాటి రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్‌లోనే ఉంటే రాష్ట్రానికి బ్యాంకర్‌గా ఉన్న ఆర్‌బీఐ చెల్లింపులను నిలిపివేస్తుందని లేఖలో ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరుసగా 14 పనిదినాల్లో ఓడీలోనే ఉన్నా.. తన సాధారణ వేజ్ అండ్ మీన్స్ మొత్తం పరిమితిని మించి వరుసగా 5 పనిదినాలు ఓవర్‌డ్రాఫ్ట్‌లో ఉన్న సందర్భాలు ఒకటికి మించి ఉన్నా బిల్లుల చెల్లింపులు నిలిపివేస్తామని లేఖలో హెచ్చరించారు. అంతేకాకుండా ఒక త్రైమాసికంలో 36 రోజులకు మించి ఓడీలోనే ఉన్నా బిల్లుల చెల్లింపులు ఆపేస్తామని తెలిపారు. డిసెంబర్ 1 నుంచి 8 వరకు రిజర్వు బ్యాంకులో ఏపీ ప్రభుత్వ ఖాతా వరుసగా ఏడు పనిదినాల్లో ఓవర్ డ్రాఫ్ట్‌లోనే ఉందన్నారు. ఈ త్రైమాసికంలో ఇప్పటికే 19 రోజులు రాష్ట్రం ఓడీలోనే ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే డిసెంబర్ 17 నాటికి మిగిలిన 14 రోజుల పరిమితి దాటిపోతుందని లేఖలో రావత్ హెచ్చరికలు జారీ చేశారు.