ఏపీలో వచ్చిన వరద నష్టాన్ని పరిశీలించేందుకు ఒక్క కేంద్ర మంత్రి రాలేదని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం, సీఎం జగన్ పై తీవ్రంగా విమర్శలు చేశారు. రాయలసీమలో వచ్చిన విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న జగన్ పర్యటనను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. వరదలు వచ్చినప్పుడు ఏ ఒక్క ప్రజాప్రతినిధి ప్రజలకు అండగానిలవలేదని ఆయన మండిపడ్డారు.
కాగా పోలవరానికి కేంద్రం అన్యాయం చేస్తున్న సీఎం జగన్ నోరు మెదపడం లేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా పోలవరానికి జరగుతున్న అన్యాయం పై పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీయాలని ఆయన అన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వాలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. వరదల్లో నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని పెంచడంతో పాటు త్వరగా అందేలా చూడాలని రామకృష్ణ అన్నారు. పోలవరం ప్రాజెక్టులో ఎందుకింత జాప్యం వహిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.