ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈరోజు కొత్తగా 4,570 కేసులు వెలుగు చూశాయి. ఓ పక్క సామాన్యులు.. మరోవైపు రాజకీయ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో పలువురు రాజకీయ నేతలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. తాజాగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కరోనా బారిన పడ్డారు. దీంతో తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రకటించారు. ఇటీవల తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
Read Also: చీప్ పబ్లిసిటీ కోసం రఘురామ ఆరాటం: విజయసాయిరెడ్డి
మరోవైపు కనిగిరి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు. అంతేకాకుండా మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి భార్య శచీదేవికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెతో పాటు మంత్రి బాలినేని కూడా హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తమను కలిసిన వారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని అనుమానం వస్తే పరీక్షలు చేయించుకోవాలని రాజకీయ నేతలు సూచించారు. కాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే ధర్మాన కూడా ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.