విలీన మండలాల్లో పోలవరం నిర్వాసితులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.. ఓవైపు గోదావరి ముంచెత్తుతుంటే.. అదే ముంపులో నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నారు.. అల్లూరి జిల్లా విలీన మండలాల్లో పోలవరం నిర్వాసితుల ఆందోళనలు హోరెత్తుతున్నాయి..నిన్న చింతూరు వరద నీటిలో ధర్నాకు దిగిన నిర్వాసితులు.. తాజాగా ఈ రోజు వి.ఆర్.పురంలో వద్ద భారీగా ఉన్న వరద నీటిలో ఆందోళన చేపట్టారు.. విలీన మండలాల్లో ప్రతి సంవత్సరం సంభవించే వరదలకు తాము అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకునే నాథుడే కారువయ్యాడని ఇక్కడి నిర్వాసితులు లబోదిబోమంటున్నారు.
Read Also: TS Eamcet 2022: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. టాప్ ర్యాంకర్లు వీరే
ఇక, ఎప్పటికప్పుడు కల్లబొల్లి కబుర్లతో, కాంటూరు కాకిలెక్కలతో తమని ప్రభుత్వం మోసం చేస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు.. ప్రతీ సారి వరదలు రావడం, అధికారులు నాలుగు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, 10 కిలోల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకోవడం పరిపాటైపోయిందని బాధితులు వాపోయారు.. ఈ సారి వచ్చినభారీ వరదలతో తాము సర్వం కోల్పోయి కట్టుబట్టలతో నడిరోడ్డుపై పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇంకా అధికారులు చెప్పే మాయమాటలు నమ్మే ఓపిక తమకు లేదని, వెంటనే మునిగే గ్రామాలన్నింటిని 41.15 కాంటూరు లో కలిపి, ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇచ్చి ఈ బాధలనుండి తమకు విముక్తి కలగ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు… సుమారు 300 మందికి పైగా నిర్వాసితులు పాల్గొన్న ఈ ధర్నాలో తమకు సత్వరమే ప్రభుత్వం న్యాయం చెయ్యకపోతే తమ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని నిర్వాసితులు హెచ్చరిస్తున్నారు. ఇక, అల్లూరి జిల్లా చింతూరులో పోలవరం ముంపు బాధితుల ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే..