నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి లో జరిగిన కాల్పుల ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులకు ఉపయోగించిన గన్ ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన నెల్లూరు జిల్లా కాల్పుల ఘటనలో నిందితుడు సురేష్ రెడ్డికి గన్ ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. గతంలో ఎలాంటి నేర చరిత్ర లేని సురేష్ రెడ్డి ఇంతటి దారుణానికి ఒడి గట్టడం వెనుక ఎవరిదైనా ప్రోత్సాహం..ఉందా అనే విషయం పై ఆరా తీస్తున్నారు.
మేడ్ ఇన్ యు.ఎస్.ఏ.అని ఉన్న గన్ ను ఎక్కడ కొనుగోలు చేశారు? దీనికి ఎవరెవరు సహకరించారనే విషయాన్ని విశ్లేషిస్తున్నారు. సురేష్ రెడ్డి ఉపయోగించిన రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. మిత్రులు ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. మూడు నెలల నుంచి సురేష్ రెడ్డి వెళ్లిన ఊర్లు..కలిసిన వ్యక్తుల గురించి కూడా వివరాలు తెలుసుకుంటున్నారు. ఫోన్ డేటా ఆధారంగా ఎవరెవరితో మాట్లాడారనే విషయాన్ని తెలుసుకుని వారిని ప్రశ్నించనున్నారు.
మరో వైపు గన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక నిపుణుల బృందం రంగంలోకి దిగింది. సోమవారం రాత్రి గన్ విడిభాగాలను బృందం సభ్యులు పరిశీలించారు. మేడ్ ఇన్ యూ.ఎస్.ఏ.అని ముద్రితమైన ఆ పిస్టల్ పనితీరు..ఎన్ని రౌండ్స్ ..లోడ్ చేసిన బుల్లెట్స్ ను కూడా పరిశీలించారు. కావ్య ఇంట్లో దొరికిన బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని ఎక్కడ నుంచి తెచ్చారనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పిస్టల్ ద్వారా అయిదు రౌండ్ల కాల్పులు జరిపినట్లు గుర్తించారు.
ఇందులో రెండు రౌండ్లు కావ్య ఇంట్లో జరపగా..మరో బుల్లెట్ తో సురేష్ రెడ్డి కాల్చుకున్నాడు. మరో రెండు బుల్లెట్లు ఎక్కడ ఉపయోగించాడనే విషయం పై దృష్టి సారించారు. ప్రాక్టీస్ కోసం ఎక్కడైనా రెండు రౌండ్లు కాల్పులు జరిపారా? అనే కోణంలో కూడా విచారిస్తున్నామని ఒక పోలీస్ అధికారి తెలిపారు. గన్ ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యులు గుర్తించే అవకాశం ఉందని భావించిన సురేష్ రెడ్డి ..ఇంటికి సమీపంలోని తమల పాకుల తోటలో దాచి ఉంచినట్లు తెలిసింది. రెండు రోజుల పాటు రెక్కీ నిర్వహించి ఒక పథకం ప్రకారమే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిసింది. కావ్య ఇంటికి ఎదురుగా ఉన్న స్కూల్ వద్ద సురేష్ రెడ్డి ఫుట్ ప్రింట్స్ ను కూడా పోలీసులు గుర్తించారు. మొత్తం మీద గన్ ఏ విధంగా వచ్చిందనే విషయాన్ని త్వరలోనే తేలుస్తామని పోలీసులు చెబుతున్నారు.
Breaking: నెల్లూరులో కాల్పుల కలకలం.. ఇద్దరు టెక్కీలు మృతి