రాజమండ్రిలో జరిగిన గోదావరి గర్జన సభలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. ఢిల్లీ నుంచి చాలా అబద్ధాలను పోగేసుకుని వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై జేపీ నడ్డా నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆయన మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ గురించి ఒక్క మాటైనా చెప్పారా అని నాని ప్రశ్నించారు. పోలవరం పెండింగ్ బిల్లులు ఇంకా ఎందుకు ఇవ్వలేదని ఆయన నిలదీశారు. ఈడీ, ఐటీ దాడులతో ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతోంది ఎవరని పేర్ని నాని చురకలు వేశారు.
ఏపీ అప్పులపై నడ్డా చెప్పింది అంతా తప్పేనని.. 130 లక్షల కోట్లకు దేశ అప్పును తీసుకుని వెళ్లింది ఎవరంటూ ఆయన ధ్వజమెత్తారు. మసీదులను కూలదోయటం, శవాల మీద బుల్డోజర్లు పోనివ్వటం మినహా మీరు చేస్తున్నది ఏంటని మండిపడ్డారు.నడ్డా ఏపీకి వచ్చే ముందు ఆర్ధిక మంత్రిని అడిగి వివరాలు తీసుకుని వస్తే బాగుండేదంటూ నాని సెటైర్లు వేశారు. తాము పరిమితికి మించి అప్పులు చేస్తే కేంద్రం ఏం చేస్తోందని ఆయన నిలదీశారు. మోదీకి, ఆర్థిక మంత్రికి తెలియకుండా అప్పులు తీసుకున్నామా అంటూ చురకలు వేశారు. ఆయుష్మాన్ భారత్ కింద పెట్టే రూల్స్ అమలు చేస్తే ఏపీలో ఒక్కరికీ ఆరోగ్యశ్రీ రాదని ఆయన ఆరోపించారు. దేశంలో మతం పేరుతో తన్నుకునేలా విధ్వంస రాజకీయాలు చేస్తోంది మీరు కాదా అని పేర్ని నాని ఎద్దేవా చేశారు.
దేశంలో ప్రతిపక్షాలపై పువ్వు పార్టీ ఏ రకంగా ఈడీలు, సీబీఐ పేరుతో దాడులు చేస్తున్నది అందరికీ తెలుసని ఆయన విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీని కాపీ కొట్టి ఆయుష్మాన్ భారత్ అని తీసుకుని వచ్చిన చరిత్ర బీజేపీది అంటూ ఆరోపించారు. ఆరోగ్యశ్రీలో కేంద్రం ఇచ్చింది 230 కోట్లేనని… రాష్ట్ర ప్రభుత్వం ఏటా పెడుతున్న ఖర్చు 2,300 కోట్లు అంటూ పేర్ని నాని వివరించారు. కోటి 30 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ఇస్తుంటే.. కేంద్రం ఇస్తున్నది 50 లక్షల కుటుంబాలకు మాత్రమేనన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏమైనా రాష్ట్రానికి బిచ్చం వేస్తోందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమకు అంబేడ్కర్ జిల్లా పేరు పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని ఒక్క మాట మాట్లాడటానికి నోరు రాలేదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టారని అది ఏమయ్యిందంటూ ప్రశ్నించారు. విజయవాడ, తిరుపతికి అంతర్జాతీయ విమానాశ్రయం, విశాఖకు మెట్రో రైలు వంటి హామీలు ఏమయ్యాయన్నారు. మ్యానిఫెస్టోను కాలగర్భంలో కలిపేశారా అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు.
దేశ ప్రజలపై ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి, స్కూళ్లల్లో నాడు- నేడు, ఆరోగ్య శ్రీ వంటి కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. నడ్డా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని చేసిన వ్యాఖ్యలపై ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్ ఏకైక ఆప్షన్ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయటమేనని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు… పవన్ కళ్యాణ్ కాదని పేర్ని నాని అన్నారు.