గతంలో అవినీతి, కుంభకోణాలు మాత్రమే వార్తలుగా నిలిచేవని… కానీ ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక సంస్కరణలు తెచ్చారని బీజీపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భాజపా గోదావరి గర్జన సభకు నడ్డా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. తెలుగు సంస్కృతికి ఈ ప్రాంతం ప్రతిబింబంగా ఉందన్నారు. 2014కు ముందు దేశంలో తీవ్రమైన విద్యుత్ కోతలు ఉండేవని ఆయన పేర్కొన్నారు. గతంలో ఆరోగ్య రక్షణ, ఆరోగ్య బీమాకు హామీ లేదన్న నడ్డా.. బంధుప్రీతి వారసత్వానికి పరాకాష్టగా పాలన సాగేదన్నారు. మోదీ రాజకీయ దృక్కోణాన్ని పూర్తిగా మార్చారని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
Jayaprada: ఆంధ్రప్రదేశ్ 7 లక్షల కోట్ల అప్పుల ప్రదేశ్‌గా మారింది
మోదీ దేశంలో అవినీతిని పారద్రోలేందుకు చర్యలు తీసుకున్నారని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశారన్నారు. సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. సంక్షేమ కార్యక్రమాలు గతంలో పేపర్లకే పరిమితమయ్యేవని.. నేడు దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. భారత్‌కు విదేశీ పెట్టుబడులు పెరిగాయని ఆయన వెల్లడించారు. కేంద్ర సర్కారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా 2.5 కోట్లు ఇళ్లు నిర్మించిందని.. పేదలందరికీ దాని నిర్మించాలనేదే మోదీ కల అని ఆ కలను నెరవేరుస్తామన్నారు. ఒకే దేశం- ఒకే గ్రిడ్, ఒకే దేశం- ఒకే రేషన్ వంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. భారత్ అనేక రంగాల్లో ప్రగతిపథంలో వెళ్తోందన్నారు.