ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రైతు సంక్షేమ యాత్రలో భాగంగా ధర్మవరం, బత్తలపల్లి ప్రాంతాల్లో పర్యటించనున్న ఆయన.. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు.. అంతేకాదు.. కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం చేయనున్నారు జనసేనాని.. సత్యసాయి, అనంతపురం జిల్లాలోని ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఆర్ధిక సాయం అందించి వారిలో ధైర్యం నింపేందుకు రైతుల కోసం తలపెట్టిన కౌలు రైతుల భరోసా యాత్రను మొట్టమొదటగా పవన్ కళ్యాణ్.. ఇవాళ ప్రారంభించనున్నారు.
Read Also: Train Accident: శ్రీకాకుళం జిల్లాలో రైలు ప్రమాదం.. సీఎం జగన్ దిగ్భ్రాంతి
ఈ కార్యక్రమం కోసం ఇవాళ ఉదయం 9 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సత్య సాయి జిల్లాలోని కొత్తచెరువు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సాయం చేస్తారు. ఉదయం 11 గంటలకు ధర్మవరంలో పర్యటించనున్న ఆయన.. మధ్యాహ్నం ఒంటి గంటకు గొట్లూరు, మధ్యాహ్నం 1.30 గంటలకు బత్తలపల్లి, అనంతరం మన్నీల గ్రామానికి వెళ్లి రైతులతో ముఖా ముఖీ నిర్వహించనున్నారు జనసేన అధినేత.