Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వ దాష్టీకాలపై మహిళలు ధైర్యంగా పోరాటం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో సమస్యలు చెప్పడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. వరద బాధితులను ఆదుకోవాలని కోరితే బూతులు తిడతారా అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వరద బాధితుల సమస్యలపై మాట్లాడిన పలువురు జనసేన వీర మహిళలను శనివారం నాడు ఆయన సత్కరించారు. కోనసీమ జిల్లా గంటి పెదపూడిలో వరద బాధితుల సమస్యలను జనసేన వీరమహిళలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే వైసీపీ ఎమ్మెల్యే వారిని అసభ్య పదజాలంతో దూషించారని పవన్ ఆరోపించారు. జనసేన వీర మహిళలను దూషించిన వైసీపీ ఎమ్మెల్యేపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని పవన్ అన్నారు.
Read Also: Vishnu Vardhan Reddy: కేంద్రం నిధులను వైసీపీ సర్కారు దుర్వినియోగం చేస్తోంది
వరద కారణంగా బ్బందులు ఎదుర్కొంటున్న నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వీరమహిళలు ప్రయత్నిస్తే వారిని అడ్డుకోవడం ప్రభుత్వ సంకుచిత ధోరణికి నిదర్శనం అని పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే మహిళలపై ఇష్టానుసారం నోరుపారేసుకోవడం హేయం అని వర్ణించారు. జనసేన పార్టీకి వీర మహిళలు భవిష్యత్ వారధులు అని పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. వీర మహిళల పోరాటాలను మరింత విస్తృతం చేస్తామని, అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలు ఇవ్వడానికి జనసేన నాయకులు వస్తే ఎందుకంత భయం అని వైసీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అటు ప్రజాస్వామ్య దేశంలో మహిళల పాత్ర మరింత పెరగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు జరిగేలా జనసేన పార్టీ తన వంతు ప్రయత్నం తప్పనిసరిగా చేస్తుందని పవన్ స్పష్టం చేశారు.
ప్రభుత్వ దాష్టీకాల మీద ధైర్యంగా మహిళలు ముందుండి పోరాడాలి
Video Link: https://t.co/WIChAaydX5 pic.twitter.com/gWUx0zMPRF
— JanaSena Party (@JanaSenaParty) August 6, 2022