Pawan Kalyan: భారత దేశానికి స్వాతంత్య్రం రక్త పాతంతో వచ్చిందని.. సరదాగా సందడి చేస్తే రాలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రెండు దేశాలు విడిపోతున్న సమయంలో మతోన్మాదంతో ప్రజలను ఊచకోత కోశారని ఆవేదన వ్యక్తం చేసారు. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన యోధులను జనసేన ఆదర్శంగా తీసుకుందన్నారు. కులం కోసం మతం కోసం పోరాటాలు కాదు.. దేశం కోసం పోరాటం చేయాలన్నారు. ప్రాంతాల పేరుతో విడగొట్టడం తేలికైన పని అన్న ఆయన.. అందరినీ కలిపి ఉంచడమే కష్టమన్నారు. మత ప్రాతిపదిక లేని రాజకీయాలు ఉండాలన్నారు. దేశంలో ప్రతి ఒక్కరి యాస భాషలను గౌరవించాలన్నారు.
AP CM Jaganmohan Reddy: త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
2014లో ప్రారంభించిన జనసేన ఈ గడిచిన ఏళ్లలో సెక్యులరిజ భావాలతోనే నడుచుకుంటూ ఉందన్నారు. ఏ మతం వారు తప్పు చేసినా కఠినంగా వ్యవహరించాలన్నారు. చర్చిలను, మసీదులను కాపాడి దేవాలయాలను వదిలేస్తే సెక్యులరిజం కాదన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిపై నిజాయితీగా వ్యవహరించాలన్నారు. అయ్యప్ప దేవాలయం ప్రవేశం గురించి మాట్లాడే వాళ్లు ఇతర మతాలలో ఉన్న లోపాలను విమర్శించలేదని.. ఇదే సెక్యులరిజమా? అంటూ ఆయన ప్రశ్నించారు. అవసరాల కోసం సెక్యులరిజం భావాలు చెప్పొద్దన్నారు. తప్పు ఎవరు చేసినా ముక్త కంఠంతో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. తాను ఒక కులం కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. తాను సోషలిస్ట్ భావాలతో, జాతీయ భావంతో పెరిగిన వాడినన్నారు.
బాధ్యత కలిగిన సీఎం స్థానంలో ఉండి కూడా జగన్ కులాల ప్రస్తావన చేస్తున్నారని పవన్ ఆరోపించారు. వైసీపీ నాయకులు పద్దతి మార్చుకోవాలని సూచించారు. జనసేనను ఒక కులానికి అంతగట్టే వ్యాఖ్యలను వైసీపీ నాయకులు వెనక్కి తీసుకోవాలన్నారు.