మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తొలగించి… ఆ బాధ్యతల్ని సంచయిత గజపతిరాజుకు అప్పగించింది ఏపీ సర్కార్. అయితే, దీనిపై అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన సంచయిత నియామకానికి సంబంధించిన జీవోను కొట్టి వేసింది. దీంతో మాన్సాస్ ట్రస్ట్‌తో పాటు సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త బాధ్యతల్ని తిరిగి చేపట్టారు అశోక్ గజపతిరాజు. అయితే, ఈ వివాదానికి అక్కడితో తెరపడలేదు. విశాఖలో రాష్ట్ర మహిళ కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మను కలిసిన సంచయిత గజపతిరాజు… తనకు అన్యాయం జరిగిందంటూ ఫిర్యాదు చేశారు. తన నియామకంతో పాటు వారసత్వం అంశాన్ని కించపరిచేలా అశోక్ గజపతిరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
సంచయిత ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించారు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ. మహిళల పట్ల అశోక్ గజపతిరాజు వివక్ష చూడం సరికాదన్నారు. మాన్సాస్ బైలా అంటే సతీ సహగమనం చేయాలా అని ప్రశ్నించారు. అశోక్ గజపతిరాజు రాచరికపు వ్యవస్థలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు వాసిరెడ్డి పద్మ. మొత్తానికి సంచయిత ఫిర్యాదు, దానిపై మహిళా కమిషన్ స్పందన చూస్తుంటే… మాన్సాస్ ట్రస్ట్ ఇప్పట్లో వివాదాల నుంచి బయటపడే అవకాశం లేదనిపిస్తోంది. మరోవైపు.. అశోక్ గజపతిరాజుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.