CPI Ramakrishna: రాయలసీమ సాగు నీటి సాధనా సమితి ఆధ్వర్యంలో ఏపీలో ప్రాజెక్టుల నిర్మాణంపై సమావేశం. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రైతు సంఘం నాయకులు వడ్డే శోభనాద్రి రావు, ఇరిగేషన్ నిపుణులు లక్ష్మీనారాయణతో పాటు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. గాలేరి, హంద్రీనీవా వంటి పలు ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేయాలి అన్నారు. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి.. తప్ప బడ్జెట్ లో మాత్రం కేటాయింపులు జరపటం లేదని ఎద్దేవా చేశారు. ఈ సారి బడ్జెట్ లో ప్రాజెక్టులను పూర్తి చేయటం కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పూర్తి చేసేలా సహకారం అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.
Read Also: Tirumala Laddu Case: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో సిట్ దూకుడు..
ఇక, ఇరిగేషన్ నిపుణులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. నాలుగు అంశాలపై ప్రధానంగా సమావేశంలో తీర్మానాలు చేశాం అన్నారు. ఏపీ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఉన్నాయి.. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 512 టీఎంసీల నీరు ఏపీకి ఉంచాలి.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు ప్రాజెక్టులు పూర్తి చేసి నీటి సమస్య తీర్చాలి అని డిమాండ్ చేశారు. 10 వేల కోట్లు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని కోరారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధాన పథకాన్ని గొల్లాపల్లి రిజర్వాయర్ వరకు నిర్మాణం చేయాలి అని సూచించారు. అక్కడి నుంచి సోమశిల మీదుగా పెన్నాకు అనుసంధానం చేయాలన్నారు. బనకచర్లకు గోదావరి అనుసంధానం అనే అంశాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం.. ఇరిగేషన్ రంగ ప్రముఖులు, ఇంజనీర్లు కూడా మా అభిప్రాయాలను సమర్థించారు.. కూటమి ప్రభుత్వం గోదావరి, బనకచర్ల అనే నిర్ణయం విడనాడాలి అని చెప్పుకొచ్చారు. భవిష్యత్తు లో వచ్చే ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలి.. ఎగువ రాష్ట్రాలు వాటా అడిగే ప్రమాదం కూడా ఉంది.. ఈ అంశాలపై తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతున్నామని లక్ష్మీ నారాయణ వెల్లడించారు.