Minister BC Janardhan Reddy: ఏపీలో ఈ రోజు రెవెన్యూ గ్రామ సభలు ప్రారంభమయ్యాయి.. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోంది.. అయితే, నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి పల్లెలో నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఇక, సీఎం సహాయ నిధికి, సంబంధించి స్థానిక వీఆర్వో గంగన్న తనను 2 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడని, గ్రామ సభలో ఓ మహిళ మంత్రికి ఫిర్యాదు చేసింది. దీంతో.. వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు మంత్రి..
Read Also: Car Sales : అమ్మకాలు క్షీణించినా.. అత్యధికా కస్టమర్లను పొందిన టాప్ 10కంపెనీలు ఇవే !
మహిళ ఫిర్యాదు చేయగానే వీఆర్వో గంగన్నను గ్రామసభ వేదికపైకి పిలిపించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. వీఆర్వో గంగన్నను సస్పెండ్ చేయాలంటూ ఇదే గ్రామ సభలో పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్‌ను ఆదేశించారు. రెవెన్యూ శాఖలోని కొందరు ఎమ్మార్వోలు, ఆర్ఐలు వీఆర్వోల కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు రైతులకు సేవ చేసే సంకల్పంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఇక, రైతులు తమ భూములకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామసభలో అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి బీసీ స్థానిక రైతులకు సూచించారు. గ్రామసభ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం, రెవెన్యూకు సంబంధించి ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో పేదల భూములను స్వాధీనం చేసుకొని దురాక్రమణ పాల్పడిందని ఆరోపించారు, పేదల భూములను కబ్జాలు చేసిన వారికి శిక్ష తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి..