Nallapareddy Prasanna Kumar Reddy: అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ను బాలయ్య ఇంటర్వ్యూ చేసిన ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ షోలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలేనంటూ వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించి మానసికంగా చంద్రబాబు హత్య చేశారని తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూకు బాలకృష్ణ ఎలా ఆహ్వానించారని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్టీ రామారావు కాళ్లు పట్టుకున్నాడు అంట.. ఆనాడు 14 మంది శాసనసభ్యులు ఎన్టీ రామారావుతో ఉన్నామని.. వైస్రాయ్ హోటల్ వ్యవహారం నుంచి ఎన్టీ రామారావు చనిపోదాకా 14 మంది ఎమ్మెల్యేలం ఆయనతోనే ఉన్నామని నల్లపరెడ్డి స్పష్టం చేశారు. మిగతా వారందరూ చంద్రబాబు, రామోజీరావుకు అమ్ముడు పోయారన్నారు. చంద్రబాబు నైజం కాళ్లు పట్టుకుని లాగేయటమేనని ఆరోపించారు. ఆనాడు సీఎం కుర్చీలో ఎన్టీఆర్ ఉంటే కాళ్లు పట్టుకుని లాగేశాడన్నారు. ఎన్టీరామారావు అంటే మహానుభావుడు, ఒక భగవంతుడు అని.. ఆయనలో దేవుడిని చూశామన్నారు.
Read Also: National Games: జాతీయ క్రీడల్లో రికార్డు సృష్టించిన 10 ఏళ్ల బాలుడు
ఎన్టీఆర్ పసిపిల్లల మనస్తత్వం కలిగిన వ్యక్తి అని.. చంద్రబాబుది నీచమైన మనస్తత్వం అని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబులో నరనరాన విషమే ఉంటుందన్నారు. నమ్మి ఆడబిడ్డనిస్తే మామ గొంతు కోశాడన్నారు. ఆ రోజు వైస్రాయ్ హోటల్లో ఎన్టీరామారావును దించే దాంట్లో బాలకృష్ణ కూడా ఉన్నాడన్నారు. అల్లుళ్లు.. కొడుకులు ఒక్కటై ఎన్టీఆర్ ద్రోహం చేశారన్నారు. వాళ్లు ఈరోజు ఎన్టీ రామారావు భజన చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తండ్రి ఇచ్చింది రెండు ఎకరాలు మాత్రమేనని.. ఈరోజు నాలుగు లక్షల కోట్లకు చంద్రబాబు అధిపతి అయ్యాడని.. ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని నల్లపరెడ్డి ప్రశ్నించారు. వియ్యంకుడి షోలో కూర్చుని అబద్దాలు చెప్పినంత మాత్రాన తెలుగు ప్రజలు చంద్రబాబు చేసిన మోసాన్ని మరిచిపోరన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన పార్టీలు మూసుకోవాల్సిందేనని.. ఆ రెండు పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.