ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడ..? మాటలు తప్ప చేతలు లేని చేతగాని ప్రభుత్వమిది.. వరుసగా మహిళలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నా సీబీఐ దత్తపుత్రుడిలో చలనం లేదు అంటూ ఫైర్ అయ్యారు మనోహర్.. పోలీసులను రాజకీయ అవసరాలకు వాడుకుంటూ శాంతి భద్రతలను గాలికొదిలేశారని ఆరోపించిన ఆయన.. దిశ చట్టం చేశాం.. గన్ కంటే జగన్ ముందు వస్తాడు.. లాంటి మాటలు చెప్పడం తప్ప వైసీపీ పాలకులు.. యువతులకు, మహిళలకు ఇసుమంతైనా రక్షణ ఇస్తున్నారా..? అని తన ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని నిలదీశారు.
Read Also: High Court: ఆరుగురు ఐఏఎస్‌లకు ఊరట… సేవా శిక్ష సస్పెండ్..
వైసీపీ పాలనలో మాటలు తప్ప చేతలు లేకపోవడం వల్లే అఘాయిత్యాలు చోటు చేసుకొంటున్నాయని విమర్శించారు నాదెండ్ల.. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో వివాహితపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టి హత్య చేసిన ఘటన బాధాకరమని పేర్కొన్న ఆయన.. కొల్లూరు మండలం చిలమూరులోనూ పట్టపగలే ఓ మహిళ హత్యకు గురవ్వడం దురదృష్టకరం అన్నారు. ఒక సంఘటన మరువక ముందే మరో సంఘటన జరుగుతోంది.. ఇంత జరుగుతోన్నా.. సీబీఐ దత్తపుత్రుడిలో చలనం లేదు.. మహిళల రక్షణ విషయంలో పాలకులకు చిత్తశుద్ధి లోపించడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఇలాంటి దారుణాలకు ఒడిగట్టేవారికి భయం అనేది లేకుండాపోయిందని.. చట్టాలు చేశాం, యాప్ తెచ్చాం అని ప్రకటనలు మాత్రమే చేసే చేతగాని ప్రభుత్వం వల్ల ఆడబిడ్డలకు ధైర్యం కలగడం లేదన్నారు.
సీఎం ఇంటికి సమీపంలో కృష్ణా నది ఒడ్డున గతేడాది జులైలో సామూహిక అత్యాచారం చోటు చేసుకొంటే ఇప్పటికీ ఓ నిందితుడిని పట్టుకోలేదు.. వైసీపీ ప్రభుత్వం పోలీసు శాఖను తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటూ శాంతిభద్రతలు గాలికొదిలేసిందని ఆరోపించారు. వైసీపీ ఫ్లెక్సీలు చిరిగితే స్కూలు పిల్లలను పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టే స్థితికి ఆ శాఖను దిగదార్చారని విమర్శించారు.. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి అని చెప్పుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం? అని ప్రశ్నించారు. ఆడబిడ్డలకు రక్షణ కల్పించి.. అఘాయిత్యాలకు పాల్పడేవారిపై కఠిన శిక్షలు పడేలా కేసులు నమోదు చేసినప్పుడు ఆ అవార్డులకు విలువ ఉంటుందన్నారు నాదేండ్ల మనోహర్.