తిరుమలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసారం చేసే టీటీడీ స్క్రీన్ పై ఒక్కసారిగా సినిమా పాటలు ప్రత్యక్షం కావడంతో శ్రీవారి భక్తులు షాక్ తిన్నారు.. శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తులలో ఆధ్యాత్మికతతో పాటు భక్తిభావం పెంచేందుకు టీటీడీ తిరుమలలోని భక్త జన సంచారం అధికంగా వుండే శ్రీవారి ఆలయం, కళ్యాణకట్టతో పాటు పలు ప్రదేశాల్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసింది. ఈ స్క్రీన్ల పై టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ లో ప్రసారమయ్యే ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు శ్రీవారి ఆలయంలో స్వామి వారికి జరిగే పూజాది కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది. దీంతో వివిధ ప్రదేశాల నుంచి శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తులు టీటీడీ ఏర్పాటు చేసిన స్క్రీన్ల వద్ద బస చేసి టీటీడీ ప్రసారం చేసే కార్యక్రమాలను తిలకిస్తుంటారు. కానీ, ఈ సాయంత్రం షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా వున్న స్క్రీన్ పై సినిమా పాటలు ప్రసారం కావడం వివాదస్పదమవుతావుంది.
Read Also: Breaking: జీవితా రాజశేఖర్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ..
దాదాపు అరగంట పాటు ఈ తెర పై హిందీ భాషకు సంభంధించిన సినిమా పాటలు రావడంతో ఆ సమయంలో దానిని తిలకించిన భక్తులు షాక్‌కు గురయ్యారు. స్వామివారి ఆలయ విశేషాలతో పాటు పూజాది కార్యక్రమాలను ప్రసారం చేసే తెరపై సినిమా పాటలను ప్రసారం చేయడం ఏమిటంటూ టీటీడి వైఖరిపై భక్తులు మండిపడ్డారు. ఇదే సమయంలో టీటీడీ బ్రాడ్ క్యాస్టింగ్ ద్వారా గోవిందనామాలు వినపడుతుండగా… స్క్రీన్ పై మాత్రం సినిమా పాటలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఇక, ఈ ఘటనపై మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. గతంలోనూ ఇలాంటి ఘటనలే జరిగిన ఇంకా టీటీడీలో మార్పురాలేదన్న ఆయన.. తిరుమలను అన్ని రకాలుగా నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. బాధ్యులపై టీటీడీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన అమర్‌నాథ్‌రెడ్డి.. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు.