ఏపీలో హాట్ టాపిక్ గా మారింది పీఆర్సీ అంశం. దీనిపై మంత్రుల కమిటీ భేటీ అయింది. పీఆర్సీ అంశంపై ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దేందుకు మంత్రుల కమిటీ ప్రయత్నం చేసిందన్నారు సలహాదారు సజ్జల. ఉద్యోగ సంఘాల అనుమానాలు నివృత్తితో పాటు కొన్ని సర్దుబాటు చేశాం. కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఉన్నా ఉదారంగానే ఉద్యోగుల కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు సజ్జల. చాలా అంశాల్లో ఉద్యోగ సంఘాలు అంగీకారానికి వచ్చాయని భావిస్తున్నాం అన్నారు. మళ్ళీ కలిసి పనీ చేస్తాం అన్న ఆశాభావం వ్యక్తం చేశారాయన.
ఫిట్మెంట్, ఐఆర్ రికవరీ, హెచ్ ఆర్ ఏ అంశాలతో పాటు చాలా అంశాలు మాట్లాడామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇవాళ మరోమారు చర్చలు జరిపి అపోహలు తొలగించే ప్రయత్నం చేస్తాం. ఉద్యోగులతో మళ్ళీ కలిసి పని చేయాలన్నదే మా ఆకాంక్ష అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. పీఆర్సీని 5 ఏళ్లకు తగ్గించే అంశాన్ని అంగీకారాన్ని తెలిపాం. ఐఆర్ రికవరీ చేయకూడదని అడిగారు అంగీకరించాం
పీఆర్సీకి సంబంధించిన ఉద్యోగ సంఘాలు ఇచ్చిన అంశాలపై పూర్తి స్ధాయి కమిటీతో చర్చించామన్నారు పీఆర్సీ సాధన సమితి నేత కె.ఆర్.సూర్యనారాయణ, కొన్ని అంశాల్లో ఆర్ధిక శాఖ అధికారులు కొంత వివరణ ఇవ్వాల్సి ఉంది. ఉదయం 10 గంటలకు మంత్రుల కమిటీ, మధ్యాహ్నం మళ్ళీ ఉద్యోగ సంఘాల తో చర్చ ఉంటుంది. చర్చలు జరిగినా ఇంకా పూర్తి ఫలితం రాని కారణంగా మా పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. మంత్రుల కమిటీ తో చర్చలు సానుకూలంగానే జరిగాయన్నారు.
చర్చలు జరిగినా ఇంకా చాలా అంశాల్లో స్పష్ఠత రావాల్సి ఉందన్నారు స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండి శ్రీనివాస్ రావు. ఇవాళ, రేపు మా ఆందోళన కొనసాగుతుంది. చర్చలు సానుకూలంగానే జరిగాయని చెప్పగలం అన్నారు స్టీరింగ్ కమిటీ నేతలు బొప్పరాజు, కె.వెంకట్రామిరెడ్డి. చర్చలు సానుకూలంగానే జరిగాయి. నిన్న ఛలో విజయవాడలో ఉద్యోగుల ఆకాంక్షలు, ఆవేదన చర్చల్లో స్పష్టంగా కనిపించింది. కొన్ని అంశాల్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. పూర్తి స్థాయిలో అంశాలపై దేనిపైనా స్పష్టత రాకపోవడంతోనే మా ఆందోళన యధావిధిగా కొనసాగుతుందన్నారు.