ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. దసరా ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తయ్యాయి. అన్ని శాఖలు సమన్వయంతో పని చేశాయి.. జిల్లా కలెక్టరు, పోలీసు కమిషనర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన చంద్రబాబు రాజకీయాలు మాట్లాడటం సరైన పద్ధతి కాదు. ఏపీ ప్రజల అభివృద్ధి కోసం సీఎం జగన్ పని చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టం ఏపికి జరగకూడదని సీఎం అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు 10ఏళ్ల ఉమ్మడి రాజధాని ఎందుకు వదిలి వచ్చామో చెప్తే బాగుండేదన్నారు.
రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు స్వార్థం వదిలి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మాట్లాడాలి. 2014లో నేను మారిపోయా అని చెప్పాడు. అధికారంలోకి రాగానే చంద్రబాబు మాట మార్చాడు. చంద్రబాబు ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలేదు. 150కోట్లు దుర్గ గుడికి ఇచ్చానని అబద్ధాలు చెప్తున్నారు. క్యూ కాంప్లెక్స్ ఒకటి కట్టి 150కోట్లతో అభివృద్ధి చేశా అని చెప్పడం ఏంటి? సీఎం జగన్ ఎక్కడ మాట తప్పారో చంద్రబాబు చెప్పాలి. అమరావతి రాజధాని కాదని సీఎం జగన్ ఎక్కడ చెప్పారు. రాజధాని అమరావతి కాబట్టి ఇల్లు ఇక్కడ కట్టుకున్నారు. అమరావతి వద్దు హైదరాబాద్ ముద్దు అంటున్నది చంద్రబాబే అన్నారాయన.
మీరు కోరుకున్నట్లు రియల్ ఎస్టేట్ రాజధాని ఏర్పాటు చేయమంటే సాధ్యం కాదు. మీరు డిక్లేర్ చేసిన రాజధాని ఏర్పాటు చేయాలంటే ఎలా? మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే సీఎం మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.ఉత్తరాంధ్ర,రాయలసీమ ఓట్లు మీకు అవసరం లేదా? రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే…కోర్టులో కేసులు వేసింది నిజం కాదా? చంద్రబాబుకు ఆ జగన్మాత మంచి బుద్ధిని ప్రసాదించాలి. మూడు రాజధానుల ఏర్పాటు అయ్యేలా చంద్రబాబుకు ఆలోచనా జ్ఞానం పెరగాలని దుర్గమ్మను వేడుకుంటున్నా అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.