Kakani Govardhan Reddy: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. నెల్లూరు జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే పొలిటికల్ జోకర్‌గా మారారని అనిపిస్తోందని విమర్శించారు. చంద్రబాబుతో చేరడంతో పవన్ కళ్యాణ్‌కు కూడా మతిమరుపు వ్యాధి వచ్చినట్లుందన్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారని.. పవన్ ప్యాకేజీల పవన్‌గా మారిపోయారని మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు ఆయన్ను విశాఖలోని ఎయిర్ పోర్ట్ రన్ వేపైనే నిర్బంధించారని.. కానీ రాష్ట్రంలో రాజ్యాంగం అమలులో ఉంది కాబట్టి పవన్ విశాఖలో స్వేచ్ఛగా తిరిగారని మంత్రి కాకాని వ్యాఖ్యానించారు.
Read Also: CM Jagan: ఈనెల 27న నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబును మరోసారి సీఎం చేయడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని మంత్రి కాకాని ఆరోపించారు. చంద్రబాబుకు ప్రజల్లో బలం లేదని.. ఆయన కుమారుడు లోకేష్‌కు సత్తా లేకపోవడంతో దత్తపుత్రుడు పవన్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారని తెలిపారు. వ్యవసాయం గురించి అవగాహన లేని పవన్ పది పంటలను గుర్తించగలరా అని చురకలుఅంటించారు. పవన్‌కు టీడీపీ నేతలు వత్తాసు పలుకుతున్నారని.. 2014లో చంద్రబాబుతో పవన్ కలిసి.. మళ్లీ విభేదించారని.. ఇప్పుడు మళ్లీ బాబుకు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. విశాఖ రాజధాని వద్దని, వికేంద్రీకరణ వద్దని పవన్ కళ్యాణ్ ప్రకటన చేయగలరా అంటూ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. రాజకీయాల్లో పరిణితి లేకుండా పవన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.