వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన కామెంట్స్‌పై మంత్రి జోగి రమేష్ స్పందించారు. నాలుగున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ. 10లక్షల కోట్ల అప్పులు చేసిందని, హామీల్లో సీఎం జగ్ 85 శాతం ఫెయిల్ అయ్యారని అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాలుగున్నర ఏళ్ళల్లో ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చామన్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసిన పథకాలను వివరించటం చరిత్రలో జరగలేదన్నారు.
Also Read: Minister Amarnath: సీటిస్తేనే పార్టీలో ఉంటామనే నాయకులు వెళ్లిపోవడమే మంచిది..
మాకు దమ్ముంది.. ప్రజలంటే ప్రేమ ఉంది. అచ్చెన్నాయుడు ఎక్కడికి రావాలో చెప్పు.. మేం అమలు చేసిన మ్యానిఫెస్టో పై చర్చకు సిద్దంగా ఉన్నామని సవాలు విసిరారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు మావే అని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మ్యానిఫ్యాస్టోను టీడీపీ లాగా దిండు కింద పెట్టలేదని, పచారి కొట్లో అమ్ముకోలేదని విమర్శించారు. పెద్ద ముత్తాయిదులు అందరూ కలిసి మ్యానిఫెస్టో ఫెయిల్ అయ్యిందని అంటున్నారని, అంత బాగా చేస్తే మీరు ఎందుకు 23 స్థానాలకు పరిమితం అయ్యారు?? అని ఎద్దేవా చేశారు. టీడీపీకి తెగులు పట్టిందని, చంద్రబాబుకే గ్యారెంటీ లేదన్నారు.
Also Read: MLC Jeevan Reddy: బతుకమ్మ ఆడగానే హిందూ మతాన్ని గౌరవించినట్టా?.. జీవన్ రెడ్డి హాట్ కామెంట్
చంద్రబాబు ఇంటి అడ్రస్ ఎక్కడ?? ఆధార్ కార్డు ఎక్కడ?.. ఏపీలో డోర్ నెంబర్, ఇంటి అడ్రస్, ఆధార్ కార్డు లేని వాళ్లకు రాష్ట్రంతో ఏం పని…? అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫి, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని, ప్రజలు చంద్రబాబును నమ్మరన్నారు. చంద్రబాబుది దిక్కుమాలిన మ్యానిఫెస్టో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అని మేం చెప్పామా అచ్చెన్నాయుడు? ఇటువంటి డ్రామాలు చంద్రబాబు దగ్గర వెయ్యి…మా దగ్గర కాదు అంటూ అచ్చెన్నాయుడికి కౌంటర్ ఇచ్చారు.