గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది.. ఇప్పటికే భద్రచలం దగ్గర 51 అడుగులకు పైగా గోదావరి ప్రవాహం కొనసాగుతుండగా.. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.. ధవళేశ్వరం దగ్గర గోదావరి నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యింది.. ఇక, కోనసీమ లంక గ్రామాలను అప్రమత్తం చేసింది అధికార యంత్రాంగం.. అయితే, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో మళ్లీ వరద కష్టాలు మొదలయ్యాయి..
Read Also: Election Commission Shock to KA Paul: కేఏ పాల్‌కు షాక్… ప్రజాశాంతి పార్టీ గుర్తింపు రద్దు..!
గోదావరి ఉగ్రరూపంతో కోనసీమ లంక గ్రామాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.. అయినవిల్లి మండలం ఎదురు బిడియం కాజ్ వే వరద నీటిలో మునిగిపోవడంతో.. నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి… దీంతో, పీకల్లోతు నీళ్లలో గోదావరి వరద దాటుతున్నారు లంక గ్రామాల ప్రజలు.. మహిళలు, విద్యార్థులు తీవ్ర కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.. పరిస్థితి ఇలా ఉన్నా.. అధికారులు ట్రాక్టర్ లేదా పడవలు ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. లంక గ్రామాలకు వంతెనల నిర్మాణం జరగకపోవడంతో వరద కష్టాలు తప్పడంలేదని వాపోతున్నారు.. ఇక, పి.గన్నవరం మండలం చాకలిపాలెం- కనకాయలంక కాజ్‌వే కూడా నీటి మునిగింది.. దీంతో, పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు స్థానికులు.. మొత్తంగా.. జులై నుంచి దఫదఫాలుగా భారీ వర్షాలు, వరదలతో లంక గ్రామాల్లో ఇబ్బందులు తప్పడంలేదు.