రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను తనిఖీ చేసేందుకు కృష్ణా రివర్ బోర్డు బృందం, ఈరోజు తలపెట్టిన పర్యటన అర్ధంతరంగా వాయిదా పడింది. ఈ మేరకు ఏపీ నీటిపారుదల శాఖ కార్యదర్శితోపాటు ఇతర అధికారులకు కేఆర్‌ఎంబీ సభ్యకార్యదర్శి డి.ఎం.రాయిపూరే లేఖ రాశారు. కృష్ణా బోర్డు బృందంలో తెలంగాణ స్థానికత కలిగిన కేంద్ర జలసంఘం అధికారి దేవేందర్‌రావు ఉండటంపై అభ్యంతరం తెలుపుతూ ఏపీ సర్కారు.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ లో పిటిషన్ దాఖలు చేసిన తరుణంలో పర్యటన వాయిదా పడింది. ఏపీ పిటిషన్‌పై నిన్న ఎన్జీటీ న్యాయ సభ్యుడు జస్టిస్ కె.రామకృష్ణన్, సభ్య నిపుణుడు కె.సత్యగోపాల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. బృందంలో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు లేకుండా తనిఖీలు చేయగలమని కేఆర్‌ఎంబీ చెప్పిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక నివేదికను ఈ నెల 9న అందజేయాలని ఆదేశించింది.