KotamReddy Sridhar Reddy: నెల్లూరు జిల్లాలోని రాజకీయాలపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు రాజకీయ వారసత్వం లేకున్నా పోరాటాలతో ఎదిగానని స్పష్టం చేశారు. తనను రాజకీయంగా ఎదగనీయకుండా జిల్లాలోని పెద్ద రాజకీయ కుటుంబాలు అడ్డుకున్నాయని పరోక్షంగా ఆనం, మేకపాటి కుటుంబాలపై విమర్శలు గుప్పించారు. రాజకీయంగా అవకాశాలు వచ్చినా ఈ పెద్ద కుటుంబాలు అనేకసార్లు తన గొంతును కోశాయని ఆవేదన వ్యక్తం చేశారు. పదవులన్నీ వీళ్లే అనుభవిస్తున్నారని.. ఇకనుంచి ఈ ధోరణి కొనసాగనివ్వబోమన్నారు.
Read Also: IND Vs NZ: రెండో వన్డే మనదే.. సిరీస్ కూడా మనదే..!!
ఇకపై ఓట్లు, సీట్లు, మంత్రి పదవులు తమకేనని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు తాను రాజకీయాల్లో ఖరాఖండిగా ఉంటానని తెలిపారు. తాను సామాన్యుడిగా జెండా మోసి ఈ స్థాయికి వచ్చానని.. తాను రాజకీయ కుటుంబం నుంచి రాలేదన్నారు. తనవాళ్ల కోసం ఎవరితోనైనా ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సామాన్యుడిగా జెండా మోసి ఈ స్థాయికి వచ్చానని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల కోసం తాను జైలుకు కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. తనను నమ్ముకున్న వాళ్లకు అన్యాయం చేసే ప్రసక్తే లేదన్నారు. కాగా రాజకీయాలపై కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి.