IND Vs NZ: రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో వన్డే మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. భారత బౌలర్లు విజృంభించడంతో 15 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. అయితే తొలి వన్డే హీరో బ్రేస్‌వెల్, గ్లెన్ ఫిలిప్స్, శాంట్నర్ పోరాడటంతో న్యూజిలాండ్ 34.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. ఫిలిప్స్, బ్రేస్‌వెల్ కలిసి ఆరో వికెట్ కు 41 పరుగులు జోడించారు.
Read Also: Guinnis Record: ప్రపంచంలోనే అతి చిన్న స్పూన్.. గిన్నిస్ రికార్డుల్లో చోటు
మహ్మద్ షమీ 3 వికెట్లతో సత్తా చాటగా పాండ్యా, వాషింగ్టన్ సుందర్‌లకు చెరో రెండు వికెట్లు, సిరాజ్, ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌లకు తలో వికెట్ దక్కింది. అనంతరం 109 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20.1 ఓవర్లలోనే టార్గెట్‌ను అందుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ (51) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఫోర్లు, సిక్సులు కొడుతూ 49 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. తొలి వన్డే డబుల్ సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్ (40 నాటౌట్) మరోసారి ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ (11) విఫలమయ్యాడు. బౌలింగ్‌లో రాణించిన మహ్మద్ షమీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సిరీస్‌లో నామమాత్రంగా మిగిలిన మూడో వన్డే ఈనెల 24న ఇండోర్‌లో జరగనుంది.