మోడీ ప్రధానిగా అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తి చేయడం దేశం గర్వించదగ్గ విషయమని ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మినారాయణ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు దేశ రక్షణ కోసం మోడీ చేసిన కృషి అద్భుతమని ఆయన వ్యాఖ్యానించారు. మన వైపు చూడాలంటే నే పాకిస్తాన్ భయపడే స్థితికి మోడీ తీసుకు వచ్చారని ఆయన అన్నారు. వైద్య ఆరోగ్యంలో జనరిక్ మందుల ద్వారా తక్కువ ధరకు నాణ్య మైన పరికరాలు అందుబాటు లోకి వచ్చాయని ఆయన వెల్లడించారు.
ఆర్టికల్ 370, త్రిబుల్ తలాక్, రామ మందిరం లాంటి వివాదాలను ఒక్క చుక్క రక్తం చిందకుండ పరిష్కరించిన యోధుడు మోడీ అని ఆయన కొనియాడారు. భారతదేశం కోవిడ్ దెబ్బ నుండి ఆర్ధికంగా కోలుకోవడానికి ఆత్మ నిర్భర్ ప్యాకేజ్ ద్వారా ఆదుకున్న ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అన్ని హక్కులను కేటాయించడంతో పాటు రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఆర్ధిక ప్యాకేజీ లు ఇచ్చారన్నారు. సాగర మాల పథకంతో తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. రాజధాని అమరావతి అభివృద్ధికి 2500 కోట్లు మోడీ ప్రభుత్వం ఇచ్చిందని ఆయన తెలిపారు.