జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర నేటి (ఆదివారం) నుంచి కృష్ణా జిల్లాలో కొనసాగనుంది. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి వారాహి యాత్ర స్టార్ట్ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు అవినగడ్డలోని శ్రీ అక్కటి దివాకర్ వీణా దేవి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ క్రీడా ప్రాంగణంలో జనసేన అధ్వర్యంలో బహిరంగ సభ జరుగనుంది. వారాహి వాహనంపై నుంచి ప్రజలను ఉద్దేశించి పవన్ ప్రసంగిస్తారు.
ఇక, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో దాదాపు ఐదు రోజుల పాటు కొనసాగనుంది. అవనిగడ్డలో బహిరంగ సభ తర్వాత మచిలీపట్నం చేరుకుని అక్టోబర్ 2, 3 తేదీల్లో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. రేపు (అక్టోబర్ 2న) కృష్ణా జిల్లా జనసేన నాయకులతో జనసేనాని సమావేశం అవుతారు. ఎల్లుండి (అక్టోబర్ 3న) జనవాణి కార్యక్రమంలో పాల్గొని, ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరించనున్నారు. అక్టోబర్ 4న పెడన, అక్టోబర్ 5న కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన జరుగనుంది. అయితే, చేనేత కార్మికులను కలిసి వారి ఇబ్బందులను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకుంటారు. చేతి వృత్తులపై ఆధార పడిన వారికి ఒక భరోసా ఇవ్వనున్నారు.
Read Also: Bihar CM Convoy: సీఎం కాన్వాయ్ కోసం గంటసేపు ఆగిన అంబులెన్స్.. ప్రాణాపాయ స్థితిలో చిన్నారి!
టీడీపీతో పొత్తు ప్రకటించిన తర్వాత తొలిసారి పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి రాబోతుండటంతో వారాహి యాత్రలో ఆయన ఏం మాట్లాడబోతున్నారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. గత యాత్రలో వైసీపీ సర్కార్, సీఎం జగన్ టార్గెట్ గా తీవ్ర స్థాయిలో జనసేనాని విరుచుకుపడ్డారు. అయితే, ఇప్పుడు కూడా అదే పంథా కొనసాగిస్తారని జనసేన నాయకులు భావిస్తున్నారు. ఇక, మరోవైపు టీడీపీతో పొత్తు అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు కూడా పవన్ కళ్యాణకు సపోర్ట్ గా నిలవబోతున్నారు. వారాహి యాత్రకు టీటీడీ మద్దతు ఇస్తుంది. జనసేనతో కలిసి ఇప్పటికే క్షేత్రస్థాయిలో టీడీపీ కేడర్ పని చేస్తున్నప్పటికీ వారాహి యాత్రలో మాత్రం అధికారికంగా తొలిసారి ఈ రెండు పార్టీలు కలిసి పాల్గొనబోతున్నాయి.