ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి త్వరలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో రెండేళ్ళపాటు అమాత్య పదవి పొందేందుకు వివిధ జిల్లాల నుంచి పోటీ తీవ్రతరం అయింది. అధికారంలో వుండే ఏ పార్టీకి అయినా ఉభయ గోదావరి జిల్లాలు ఆయువుపట్టు. అక్కడ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీయే అధికారం చేపడుతుంది. ఈ సంప్రదాయం, సెంటిమెంట్ ఎప్పటినుంచో వస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో 2019 ఎన్నికల్లో రెండుచోట్ల మాత్రమే టీడీపీ అభ్యర్ధులు గెలిచారు. పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు, ఉండి నుంచి రామరాజు ఎమ్మెల్యేలు అయ్యారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ముగ్గురికి మంత్రి పదవులు లభించిన సంగతి తెలిసిందే. ఆళ్ళనాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత లక్కీ ఛాన్స్ కొట్టేశారు. రెండున్నరేళ్ళ తర్వాత మంత్రిమండలిని మారుస్తానని జగన్ ఆనాడే ప్రకటించారు. అయితే కాస్త ఆలస్యం అయింది. తాజాగా మంత్రి మండలిలో కొత్తవారిని తీసుకోవడానికి రంగం సిద్ధం అయింది. జిల్లాకు చెందిన ఆశావహులు మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్లస్, మైనస్ లను బేరీజు వేసుకోవడంతో మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనేది చర్చనీయాంశంగా మారింది. జిల్లాకు దక్కే మంత్రి పదవులు ఎన్ని? ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయనేది చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ప్రధానంగా ఐదుగురు మంత్రి మంత్రి పదవుల కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాసరావు, నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. వీరిలో ముగ్గురికి పదవులు దక్కే అవకాశం ఉంది. వీరిలో గ్రంధి శ్రీనివాస్, బాలరాజు, తలారి వెంకట్రావు ముందు వరుసలో ఉన్నారు. క్షత్రియ సామాజిక వర్గం నుంచి ప్రస్తుత మంత్రి శ్రీరంగనాథరాజుని తప్పిస్తే ముదునూరి ప్రసాదరాజుకి అవకాశం రావచ్చని ప్రచారం సాగుతోంది.
భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గడిచిన ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గెలుపొందడం ప్లస్ పాయింట్, మొదటి నుండి వెన్నంటి ఉన్నవారిని దూరం పెట్టడం, సామాజిక వర్గాల వారికి సమదూరం పాటించడం మైనస్ గా మారింది.బాలరాజు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి మొదటి నుండి దగ్గరగా ఉన్న వారిలో ఒకరు కావడం ప్లస్ పాయింట్. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలను పూర్తి స్థాయిలో ఆదుకోకపోవడం మైనస్ .
రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో కొవ్వూరు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితను తప్పించే పరిస్థితి నెలకొంది. ఇదే జరిగితే వనిత సామాజిక వర్గానికి చెందిన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. పార్టీలో సీనియర్ నాయకులు కావడం కలిసి వచ్చే అవకాశం. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పలు అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు.ఈయనకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ తక్కువగా ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ మదిలో ఏముందో? జిల్లా నుంచి కేబినెట్లో బెర్త్ దొరికేది ఎవరికో చూడాలి.