గుంటూరులో డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏపీ హోంమంత్రి సుచరిత ప్రారంభించారు. బ్రాడిపేట లోని క్యాంప్ కార్యక్రమం నుండి వర్చువల్ విధానంలో హోంమంత్రి సుచరిత పాల్గొన్నారు. మియావాకి పద్దతిలో రాష్ట్రంలోని ఎనిమిది బెటాలియన్ లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సుచరిత ప్రారంభించారు. మంగళగిరి 6వ బెటాలియన్ లో డీజీపీ గౌతం సవాంగ్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు మొక్కలు నాటారు. అన్ని బెటాలియన్ లలోని దాదాపు 15.35 ఎకరాల్లో 19,774 మొక్కలను పోలీసు అధికారులు నాటారు.
మొక్కలు నాటే కార్యక్రమంలో పోలీసు అధికారుల కుటుంబసభ్యులు, స్కూల్ విద్యార్థులు, ఫారెస్ట్ అధికారులు పాల్గొనడం విశేషం. మియావాకి పద్దతిలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచవచ్చునని హోంమంత్రి సుచరిత వెల్లడించారు. మొక్కలు నాటడంతో పాటు అవి బాగా పెరిగే వరకు సంరక్షించాలని అధికారులకు హోంమంత్రి సూచించారు. రాబోయే భవిష్యత్ తరాలకు కాలుష్యం లేని వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె అన్నారు.